మార్కెట్ పంచాంగం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓటమి చెందడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు బలపడటం వంటి అంశాలతో భారత్ సూచీలు వరుసగా మూడో వారమూ తగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాల బాట పట్టడం ఈ క్షీణతకు ప్రధాన కారణం. డాలరు బలపడటం, రూపాయి బలహీనపడటం సహజంగానే విదేశీ ఇన్వెస్టర్లను విక్రయాలకు పురికొల్పుతుంది.
అయితే మూడు వారాల్లో సూచీలు 7 శాతంవరకూ నష్టపోయినందున, ఈ వారం క్షీణిస్తే కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం లేకపోలేదు. కానీ విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల వేగాన్ని పెంచితే పతనం కొనసాగవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
నవంబర్ 13తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్ వారంలో మరింత క్షీణించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన 25,530 పాయింట్ల మద్దతు వరకూ తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 654 పాయింట్ల నష్టంతో 25,611 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడు వారాల్లో 1,700 పాయింట్లకుపైగా సెన్సెక్స్ నష్టపోయింది.
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు క్షీణించడం, పారిస్‌లో ఉగ్రవాదుల దాడులు వంటి అంశాల కారణంగా ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో సెన్సెక్స్ మొదలైతే 25,400 పాయింట్ల వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే తదుపరి రోజుల్లో సెప్టెంబర్ 8నాటి కనిష్టస్థాయి అయిన 24,833 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు.
మధ్యలో 25,100 పాయింట్ల సమీపంలో మరో తాత్కాలిక మద్దతు వున్నది. తొలి మద్దతును ముగింపులో పరిరక్షించుకోగలిగితే 25,950 పాయింట్ల స్థాయివరకూ సూచీ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 26,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. అటుపైన క్రమేపీ 26,440 స్థాయికి చేరవచ్చు.
నిఫ్టీ మద్దతు 7,700
గతవారం మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 7,735 సమీప మద్దతుస్థాయివరకూ తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 192 పాయింట్ల నష్టంతో 7,762 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ మొదలైతే 7,700 పాయింట్ల వద్ద చిన్న మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే క్రమేపీ 7,600 స్థాయి వద్దకు తగ్గవచ్చు.
ఆ లోపున తిరిగి రెండునెలల కనిష్టస్థాయి అయిన 7,540 పాయింట్ల వద్దకు పడిపోయే ప్రమాదం వుంటుంది. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే 7,850 స్థాయిని చేరవచ్చు. అటుపైన ముగిస్తే 7,930 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన పటిష్టంగా ముగిస్తే 8,005 స్థాయి వరకూ పెరగవచ్చు.
25,400 దిగువన మరింత క్షీణత
Published Mon, Nov 16 2015 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM
Advertisement
Advertisement