సెన్సెక్స్ నిరోధం 29,800 | Sensex 29,800 | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ నిరోధం 29,800

Published Mon, Feb 23 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

Sensex 29,800

మార్కెట్ పంచాంగం
భారత్ స్టాక్ సూచీలు దాదాపు రికార్డుస్థాయిలో ట్రేడవుతున్న సమయంలో బడ్జెట్ వారం సమీపించింది. వాస్తవానికి బడ్జెట్ అంచనాలతో పెరిగిన బ్లూచిప్ షేర్లు ఈ మధ్య పెద్దగా లేవనే చెప్పాలి. రెండు వారాల నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు 3.5 శాతంవరకూ పెరిగాయి. వీటి పెరుగుదలకు ప్రధాన కారణమైన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్, ఐటీసీ షేర్లపై బడ్జెట్ అంచనాలేవీ లేనందున, ప్రపంచ సానుకూల ట్రెండ్‌లో భాగంగానే ఇటీవల మార్కెట్ ర్యాలీ జరిగిందని భావించవచ్చు.

ఇలా అంచనాలు లేని సమయంలో వచ్చే బడ్జెట్లో మార్కెట్‌ను ఆశ్చర్యపర్చే ప్రతిపాదనను ప్రకటిస్తే, సూచీలు పరుగులు తీయవచ్చు. ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సాదాసీదాగా వున్నా, ఇన్వెస్టర్లు పెద్దగా నిరుత్సాహపడేదేమీ వుండదు. వారు ప్రపంచ మార్కెట్ ట్రెండ్‌వైపు దృష్టి మళ్ళించవచ్చు.  ఇక  సాంకేతికాంశాలకొస్తే...
 
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...,
ఫిబ్రవరి 20తో ముగిసిన వారం ప్రధమార్థంలో 29,523-29,083 పాయింట్ల మధ్య స్వల్పశ్రేణిలో కదిలిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 136 పాయింట్ల లాభంతో 29,231 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వారం  సెన్సెక్స్ అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 29,500-600 శ్రేణిని చేరవచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తే 29,800 స్థాయికి చేరవచ్చు. ఈ వారం బడ్జెట్ సందర్భంగా ర్యాలీ జరిగితే ఈ స్థాయే కీలకమైన అవరోధం.  ఆపైన స్థిరపడితే క్రమేపీ 30,100 స్థాయిని అందుకునే వీలుంటుంది.  ఈ వారం 29,500-600 శ్రేణిని అధిగమించలేకపోతే 29,080 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 28,830 పాయింట్ల వద్ద ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది. ఈ లోపున మద్దతులు 28,600, 28,400పాయింట్లు.
 
నిఫ్టీ మద్దతు 8,790-అవరోధం 8,920
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,913-8,794 శ్రేణి మధ్య కదిలిన తర్వాత చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 29 పాయింట్ల స్వల్పలాభంతో 8,833 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం 8,790 పాయింట్ల స్థాయి మూడు ట్రేడింగ్ రోజుల్లో నిఫ్టీకి మద్దతునిచ్చినందున, ఈ వారం ప్రధమార్థంలో 8,790 మద్దతును కోల్పోతేనే మరింత క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ స్థాయిని నిలుపుకుంటూ, నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే 8,920 పాయింట్ల నిరోధస్థాయికి చేరవచ్చు.  ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే 8,966 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. అటుపైన 9,050 పాయింట్ల రికార్డుస్థాయివరకూ పెరిగే ఛాన్స్ వుంది.

ఈ వారం తొలి మద్దతును కోల్పోతే 8,730 స్థాయికి వేగంగా తగ్గవచ్చు. ఆ దిగువన వెనువెంటనే 8,650 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 8,595 స్థాయికి పడిపోవొచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా 8,900, 9,000 స్ట్రయిక్స్ వద్ద కాల్ బిల్డప్‌తో పోలిస్తే 8,800, 8,700 స్ట్రయిక్స్ వద్ద పుట్ బిల్డప్ చాలా తక్కువ. వచ్చే వారం తొలి నాలుగురోజుల్లో చిన్న పెరుగుదలలో కూడా నిఫ్టీ నిరోధాన్ని చవిచూడవచ్చని, క్షీణత జరిగితే వేగంగా వుండవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement