30, 35, 42 నింగిని తాకే నిర్మాణాలు
• 30.. ఆపైన అంతస్తుల్లో నివాసానికి కస్టమర్ల మొగ్గు
• నిర్మాణానికి సిద్ధంగా 50కి పైగా ప్రాజెక్ట్‌లు
20, 25, 30, 42.. ఇవి కేవలం అంకెలేం కావు.. నగరంలో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాల్లోని అంతస్తులు. ఒకప్పుడు 15 ఫ్లోర్ల భవనాలంటేనే అమ్మో అనిచూసే నగరవాసులిప్పుడు.. ఏకంగా 30 ఆపైన అంతస్తుల్లో నివాసానికే సై అంటున్నారు. దీంతో బిల్డర్లు ఎత్తై భవనాల నిర్మాణాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో భాగ్యనగరం ఆకాశహర్మ్యాలకు వేదికవుతోంది.
సాక్షి, హైదరాబాద్ : స్థలాల లభ్యత క్రమంగా తగ్గుతుండటమే ఆకాశహర్మ్యాల నిర్మాణాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఈ తరహా నిర్మాణాలు కొరియా, హాంకాంగ్, చైనా, జపాన్, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో ఎప్పుడో మొదలయ్యాయి. కానీ, హైదరాబాద్‌లో ఎత్తై నిర్మాణాలకు బీజం పడింది మాత్రం 2006లోనే అని చెప్పాలి. ఎందుకంటే ఫ్లాట్ల విస్తీర్ణం, రోడ్డు వెడల్పును బట్టి నగరంలో ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని చేపట్టేందుకు వీలుగా 86 జీవోను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణాలు మొదలయ్యాయి.
అనుమతులూ త్వరగానే..
ఏటా నగరంలో ప్రభుత్వ విభాగాలు 8-10 వేలకు పైగా నిర్మాణాలకు అనుమతులిస్తున్నాయి. వీటిలో చిన్నా చితక నిర్మాణాలతో పాటు అపార్ట్‌మెంట్లు, ఆకాశహర్మ్యాలుంటాయి. నగరంలో ఇప్పటివరకు 20 అంతస్తుల భవంతులు తక్కువే. ఎత్తై భవనాల నిర్మాణాల కోసం జీహెచ్‌ఎంసీ అనుమతితో పాటు అగ్నిమాపక ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ), విమానాశ్రయ విభాగాల నుంచి కూడా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని రకాల అనుమతులు రావటానికి చాలా సమయం పట్టేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఒకే ఒక్క ఎన్‌ఓసీ విధానం, సత్వర అనుమతులకు ఆన్‌లైన్ విధానం తీసుకురావటం వంటి నిర్ణయాలు తీసుకోవటంతో నిర్మాణదారులు కూడా ఎత్తై నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
20 అంతస్తులకు మించినవి..
ప్రస్తుతం నగరంలో 20 అంతస్తులకు మించిన భవనాలను నిర్మించేందుకు 50కి పైగా ప్రాజెక్ట్‌లు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇవి ఎక్కువగా పశ్చిమ ప్రాంతాల్లోనే వస్తున్నాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ, ఖాజాగూడ, కూకట్‌పల్లి, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు ఊపందుకున్నాయి. సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ హైటెక్ సిటీ సమీపంలో మరీనా స్కైస్ పేరిట 31 అంతస్తుల్లో, గచ్చిబౌలిలో సుమధుర సంస్థ అక్రోపొలిస్ పేరిట 31 అంతస్తుల్లో నివాస సముదాయాలను నిర్మిస్తున్నాయి.
ఇవే కాకుండా లోధా గ్రూప్ 42, ల్యాంకోహిల్స్ 36, సాకేత్ ఇంజనీర్స్ 25, మంజీరా 23, మంత్రి 24 అంతస్తుల్లో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కొండాపూర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ. దీంతో స్థలం ఉన్న చోట్ల సాధ్యమైనంత ఎత్తులో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాల్లో స్థలాల లభ్యత ఎక్కువే కానీ, కొనుగోలుదారుల ఆసక్తి మేరకు ఆయా ప్రాంతాల్లోనూ 60 మీటర్ల కంటే ఎత్తై నిర్మాణాలొస్తున్నాయి.
మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే..
ఇదిలా ఉంటే ఆకాశహర్మ్యాలు నిర్మించాలంటే నిర్మాణానికి తగ్గట్టుగానే పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని బిల్డర్లు చెబుతున్నారు. స్థలాల కొరత ఉన్న మహానగరాల్లో ఈ నిర్మాణాలే పరిష్కారమార్గమని సూచిస్తున్నారు. ఎత్తై నిర్మాణాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఉండేలా నిర్మాణంలో నాణ్యత పాటించడం ఆవశ్యకం. మరోవైపు ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు 6వ అంతస్తు పైనుంచి ప్రతి చ.అ.కు రూ.10-15 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 10 అంతస్తుల తర్వాత మరో ధర, 20 అంతస్తుల పైన మరో ధర ఉంటుంది.
ఎత్తులో నివాసముంటే..
⇔ ఆకాశహర్మ్యాల్లో నివాసముంటే అనుకూల, ప్రతికూలాలున్నాయి.
⇔ పై అంతస్తుల్లో నివసించే వారు బాల్కనీలోంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు.
⇔ గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వస్తాయి.
⇔ పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు.
⇔ పర్యావరణ సమస్యలు, ధ్వని కాలుష్యం ఉండదు.
⇔ పై అంతస్తులో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యుత్ వినియోగం పెరిగి.. బిల్లూ పెరుగుతుంది.
⇔ తరచూ ఇళ్లు మారేవారికి సామగ్రి తరలించడం ఇబ్బందిగా ఉంటుంది.