
రక్షణ శాఖకు స్పెక్ట్రం బ్యాండ్ కేటాయింపు
న్యూఢిల్లీ: రక్షణ శాఖ, ఇతర శాఖల మధ్య దాదాపు ఎనిమిదేళ్లుగా నలుగుతున్న స్పెక్ట్రం షేరింగ్ వివాదానికి కేంద్రం తెర దించింది. రక్షణ శాఖ అవసరాల కోసం ప్రత్యేకంగా టెలికం స్పెక్ట్రం బ్యాండ్‌ను కేటాయించింది. 3 మెగాహెట్జ్ నుంచి 40 గిగాహెట్జ్ మధ్య 49 బ్యాండ్స్‌లో మొత్తం తొమ్మిదింటిని కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది.
మిగతా 31 బ్యాండ్లను టెలికం సంస్థలు, పౌర విమానయాన శాఖ, బ్రాడ్‌కాస్టర్లు తదితర యూజర్లకు కేటాయించింది. మరో తొమ్మిదింటి విషయంలో వివిధ శాఖల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అటు డిఫెన్స్, టెలికం శాఖలు వివిధ బ్యాండ్ల స్పెక్ట్రంను పరస్పరం మార్చుకునే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు.
దీని ప్రకారం టెలికం శాఖ తన వద్ద 1900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఉన్న 15 మెగాహెట్జ్ స్పెక్ట్రంను.. డిఫెన్స్ శాఖ దగ్గరున్న 2100 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంతో మార్చుకుంటుంది. 2100 మెగాహెట్జ్ బ్యాండ్ .. 3జీ టెలికం సేవలకు ఉపయోగపడుతుంది.