ఆర్థిక భరోసాకు 6 సూత్రాలు | 6 Basic Principles of Ensuring Economics | Sakshi
Sakshi News home page

ఆర్థిక భరోసాకు సూత్రాలు

Published Mon, Feb 6 2017 2:00 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

ఆర్థిక భరోసాకు 6 సూత్రాలు

ఆర్థిక భరోసాకు 6 సూత్రాలు

పెద్ద మొత్తాలొస్తాయని ఎదురు చూడొద్దు
ఆదాయ, వ్యయాలపై అంచనా అవసరం
అనవసర రుణాల జోలికి వెళ్లొద్దు
మీరెంత రిస్కు భరించగలరో తెలుసుకోండి
పొదుపు, రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ కూడా అవసరం  


జీవితంలో బోలెడన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంటాం. తీర్మానాలు చేసుకుంటాం. బరువు తగ్గాలని కొందరు, కష్టపడి పనిచేయాలని కొందరు... ఇల్లు, కారు కొనుక్కోవాలని కొందరు... ఇలా అనేకానేకం ఉంటాయి. అయితే కొన్ని లక్ష్యాలు ఆర్థికాంశాలతో ముడిపడి ఉంటాయి. ఆర్థికంగా మనం బలంగా ఉంటేనే ఇవి సాకారమవుతాయి. సంతోషాన్నిస్తాయి. పటిష్టమైన ప్రణాళికంటూ లేకపోతే ఆర్థికంగా బలపడటం అనేది కుదిరే పని కాదు. ఇందుకోసం మనకు మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన తీర్మానాలు, సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఇవి చాలా చిన్నవే. కానీ ఆర్థిక పురోగతికి ఇవి బంగారు బాటలు వేస్తాయి.

పెద్ద మొత్తం కోసం ప్లానింగ్‌ను వాయిదా వేయొద్దు
నిజజీవితంలో ఊహించని విధంగా ఆస్తులో, డబ్బో వచ్చి పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. చాలామంది రెగ్యులర్‌గా వచ్చే ఆదాయాలపై ఆధారపడాల్సిన వారే. కాబట్టి, ఒక్కసారిగా బోలెడంత డబ్బు చేతికొస్తే ప్లానింగ్‌ చేద్దామని వాయిదా వేస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే, అది ఎన్నటికీ జరగకపోవచ్చు. కాబట్టి, చిన్న మొత్తం అయినా సరే.. ఫిక్సిడ్‌ డిపాజిట్లు, జీవిత బీమా పాలసీలు, సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ మొదలైన వాటిలో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించండి.

పక్కాగా ఆదాయ, వ్యయాల లెక్కలు పాటించాలి
డబ్బుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నది మనకు తెలియని విషయం కాదు. కానీ, ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోలేకపోవచ్చు. లేదా ఆదాయంలో ఎంత మొత్తాన్ని లక్ష్య సాధనకు కేటాయించాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. దీనికి సింపుల్‌ పరిష్కార మార్గం ఒకటుంది. అదేంటంటే.. వ్యక్తిగత ఆదాయ, వ్యయాల ఖాతాను నిర్వహించుకోవడమే. దీని ద్వారా ప్రతి మూడు నెలలకోసారి మీ ఆదాయాలను, అవసరాలను, ఖర్చులను ట్రాక్‌ చేయండి. తద్వారా ఆదాయంలో ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి వీలవుతుందో మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. డబ్బు ఊరికే ఖాతాల్లో  మగ్గిపోకుండా ప్రతీ ఒక్కరూ కూడా తమ లక్ష్యాలకు అనుగుణమైన సాధనాల్లో ఎంతో కొంత ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. ఇందుకోసం రికరింగ్‌ డిపాజిట్లు, జాతీయ పొదుపు పత్రాలు, ఫండ్స్, ఇన్సూరెన్స్‌ మొదలైన వాటితో ప్రారంభించవచ్చు.

రిస్కు సామర్థ్యంపై అంచనాకు రావాలి
మీరు ఎంత మొత్తం పొదుపు చేయగలరన్న దానిపై అవగాహన వచ్చిన తర్వాత.. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఏయే ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చన్నది కూడా ఆలోచించాలి. అన్ని ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే ఏకైక సాధనం అంటూ ఏదీ లేదు. మీరు ఏ సాధనాన్ని ఎంచుకోవాలన్నది మీరు ఎంత వరకూ రిస్కును భరించగలరు, లక్ష్య సాధనకు ఎన్నేళ్లు నిర్దేశించుకున్నారు అన్న వాటిపై ఆధారపడి ఉంటుంది. భారీ రిస్కు తీసుకోగలరు, పదేళ్ల లక్ష్యం అయితే ఎక్కువగా స్టాక్‌ మార్కెట్లకు అనుసంధానమైన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మరీ ఎక్కువగా రిస్కు ఇష్టపడని వారు డెట్‌ సాధనాలు ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ వంటివి కూడా అనువైనవే. అయితే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దీర్ఘకాలిక అవసరాల కోసం స్వల్పకాలిక సాధనాల్లోనూ.. స్వల్ప కాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక సాధనాలను ఎంచుకోకండి.

ఆర్థిక భరోసా కోసం పొదుపు
ఆర్థిక భద్రత అంటే పొదుపు చేయడం మాత్రమే కాదు. డబ్బనేది ఎరువుల్లాంటివి. సరిగ్గా ఉపయోగిస్తేనే ఫలాలు దక్కుతాయి. మీకు, మీ కుటుంబానికి హెల్త్‌ ఇన్సూరెన్స్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోండి. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తం కేటాయించి ఉంచండి.
 
రుణం తీసుకునేముందే ఆలోచన..
ప్రస్తుతం అంతా ఆర్భాటాలకు ప్రాధాన్యమిస్తున్నారు. క్రెడిట్‌ కార్డులు, సులభ రుణాలు మొదలైన వాటితో మనం కోరుకునే కార్లు, విదేశీ టూర్లు, విలాసవంతంగా ఫంక్షన్లు మొదలైనవి ఇట్టే సాధ్యపడుతున్నాయి. కానీ, రుణాల మీద ఈ కలల్ని సాకారం చేసుకున్న తర్వాత మళ్లీ ఆ అప్పును తీర్చగలిగే సత్తా ఉంటోందా అంటే.. చాలా మందికి ఉండటం లేదు. కనుక, సలహా ఏమిటంటే.. రుణాలు, క్రెడిట్‌ కార్డుల విషవలయంలో చిక్కుకోవద్దు. దానికి బదులుగా మీ అవసరాలు, మీ లక్ష్యాలను మదింపు చేసుకోండి. దానికి తగ్గట్లుగా నెలవారీ, త్రైమాసికాల వారీగా బడ్జెట్లు వేసుకోండి. ఏది పడితే అది కొనేయడం కాకుండా..  అవసరమైనవి, భవిష్యత్‌లోనూ ఉపయోగపడగలిగేవి లేదా రాబడులు అందించగలిగేవి అనుకుంటేనే లోన్‌పై కొనండి. మీకు, మీ కుటుంబ శ్రేయస్సు కోసం జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు అవసరం. అలాగే, పిల్లల చదువుల కోసం కొంత మొత్తం, మీ రిటైర్మెంట్‌కి మరికాస్త నిధి అవసరమవుతుంది. తక్షణ సంతోషం కలిగించే లగ్జరీ కార్లు మొదలైన వాటికన్నా దీర్ఘకాలికమైన ఈ అవసరాలకోసం జాగ్రత్త పడటం ముఖ్యం.

రిటైర్మెంట్‌ కోసం ప్లానింగ్‌..
యవ్వనంలో ఉన్నప్పుడు ఏదీ పెద్దగా లెక్క చేయం. మంచి జీతం, ఏ బాదరబందీ లేని జీవితం అంతా బాగానే ఉంది.. రిటైర్మెంట్‌ గురించి ఇప్పట్నుంచే ఆలోచించడం ఎందుకు అనిపిస్తుంది. కానీ, ఇది అపోహ. రాబోయే రోజుల కోసం ముందునుంచే ప్లానింగ్‌ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే రోజు రోజుకీ జీవన వ్యయం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పొదుపును ఎంత వాయిదా వేస్తే ఆ తర్వాత అంత బాధపడాల్సి రావొచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత మరొకరి మీద ఆధారపడి జీవించాల్సి వస్తే బాధగానే ఉంటుంది. ఇలా జరగకూడదంటే సాధ్యమైనంత ముందు నుంచే ప్లానింగ్‌ చేసుకుంటే రిటైర్మెంట్‌ తర్వాత కూడా దర్జాగా ఉండొచ్చు. యవ్వనంలో ఉన్నప్పుడు మన బాధ్యతలు తక్కువగా ఉంటాయి. కనుక మరింతగా పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలి. ‘ఒకవేళ జీవితంలో ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా అనే ఆందోళన ఇటు మనస్సులోనూ, అటు మెదడులోనూ లేకుండా ఉండటమే ఆర్థిక స్వేచ్ఛ’ అన్నారెవరో మేధావి. కనుక, ఇలాంటి తీర్మానాలతో అలాంటి ఆర్థిక స్వేచ్ఛ సాధించే దిశగా అడుగులు వేయండి. ఆల్‌ ది బెస్ట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement