న్యూఢిల్లీ : ఏడవ వేతన సంఘ సిపారసులతో రైల్వేలపై ఆర్థికభారం మోత మోగనుందట. బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన జీతాల పెంపు సిపారసులతో అదనంగా రూ.28,450 కోట్ల ఆర్థిక భారాన్ని రైల్వేలు భరించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అలయెన్స్, బకాయిలతో కేంద్రప్రభుత్వంపై రూ.24,350 కోట్ల ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఇండియన్ రైల్వేస్ లో 13లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో 2017 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల జీతాల బిల్లులు దాదాపు రూ.70,700 కోట్లకు ఎగబాకనుందని తెలుస్తోంది. పెన్షన్ లు రూ.45,000 కోట్లకు పెరగనున్నాయి.
అయితే తాము ఈ ఆర్థిక భారాన్ని ఫిబ్రవరిలో బడ్జెట్ రూపకల్పనలోనే గుర్తించామని, స్వతహాగానే తాము ఈ ఆర్థిక భారాన్ని మేనేజ్ చేసుకోగలుగుతామని ఓ సీనియర్ రైల్వే అధికారి చెప్పారు. ఎనర్జీ బిల్లు ఆదా, పెరిగిన రవాణా, ప్యాసెంజర్, నాన్ ఫేర్ రెవెన్యూలతో ఈ ఆర్థిక భారాన్ని పూడ్చుకోగలుగుతామని వెల్లడించారు. డీజిల్, ఎనర్జీ బిల్లు పై కనీసం రూ.5,000 కోట్లను ఆదా చేసుకోగలుగుతామని, 2017 ఆర్థిక సంవత్సరంలో 500లక్షల టన్నుల రవాణా లోడింగ్ ను పెంచుకుంటామని తెలిపారు. రూ.3,000 కోట్లగా ఉన్న నాన్ ఫేర్ చార్జీలను రూ.7,000 కోట్లకు పెంచుకోవాలని రైల్వేస్ అంచనావేస్తోంది.
ప్యాసెంజర్ రెవెన్యూ 12శాతం పెంచుకోవాలని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు. రైల్వేలకు సంబంధించిన భూములను సైతం లీజింగ్ కు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇవన్నీ తమ రెవెన్యూలు పెరగడానికి దోహదంచేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. కోల్, స్టీల్ రవాణాలో రైల్వేలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని, ఆటో,ఆహార ధాన్యాలు, రసాయనాలు, పశుగ్రాసం, జనపనార, ఆయిల్ రవాణాకు ఇప్పటికే ప్రత్యేక స్కీమ్ లను ఇండియన్ రైల్వేస్ ఆవిష్కరించిందని అధికారులు చెప్పారు.
జీతాల పెంపుపై ఉద్యోగుల అసంతృప్తి
మరోవైపు ఏడవ వేతన సంఘ సిపారసులపై రైల్వే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూలై 11న పిలుపునిచ్చిన నిరవధిక బంద్ ను కొనసాగిస్తామని ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ జీ మిశ్రా తెలిపారు. ఈ ప్రతిపాదనలను తాము ఆమోదించేది లేదని, హోమ్ టేక్ జీతంగా కేవలం రూ.1,500 మాత్రమే పెరిగాయని పేర్కొన్నారు. ఇది చాలా అత్యల్పమని నిరాశవ్యక్తంచేస్తున్నారు.