కొత్త గృహ ప్రాజెక్టుల్లో 8 శాతం క్షీణత
⇔ కొత్త రియల్ ఎస్టేట్ చట్టం, డీమోనిటైజేషన్‌తో ప్రతికూల ప్రభావం
⇔ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్త గృహ ప్రాజెక్టుల ఆవిష్కరణకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో (2016–17) ఎనిమిది శాతం క్షీణత నమోదయ్యింది. ఇవి 1,08,200 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 1,17,650 యూనిట్లుగా ఉంది. కొత్త రియల్ ఎస్టేట్ చట్టం, డీమోనిటైజేషన్ తర్వాత పేలవమైన విక్రయాలు వంటి అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 25,800 యూనిట్ల కొత్త నివాస గృహ ప్రాజక్టుల ఆవిష్కరణ జరిగింది.
వార్షిక ప్రాతిపదికన చూస్తే 16 శాతం క్షీణత నమోదయ్యింది. ఎనిమిది నగరాల్లో ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు చూస్తే రెసిడెన్షియల్ విభాగంలో కొత్త ప్రాజక్టుల ఆవిష్కరణల్లో 8 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబైలోని పలు ప్రాంతాల్లో ధరలు తగ్గాయి.