దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం, దిగుమతులపై ఆధారపడిన వస్తు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. ఒక డాలర్ కొనాలంటే తాజాగా రూ.73.34 చెల్లించాలి. కానీ, ఈ ఏడాది జనవరి 1న డాలర్‌తో రూపాయి మారకం విలువ 63.88. 2018లో ఇంతవరకు 14% నష్టపోయింది. దీంతో దిగుమతి ఆధారిత పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే కాక పుట్టిస్తుండగా, మరోవైపు బంగారం ధర కూడా రేజింగ్‌లో ఉంది. ఇక ఎక్కువ మంది భారతీయులు వినియోగించే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పైనా రూపాయి ప్రభావం తీవ్రంగానే ఉంది. దేశీయ కరెన్సీ వరుసగా క్షీణిస్తూ రావడంతో చైనా కాంపోనెంట్స్‌పై ఆధారపడిన హ్యాండ్‌సెట్ తయారీదారులను అయోమయంలోకి నెట్టేసింది. స్మార్ట్‌ఫోన్లలో వాడే విడిభాగాల్లో 90% దిగుమతి చేసుకునేవే కావడం గమనార్హం. దీంతో ఇంటెక్స్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రస్తుత మోడళ్లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇక చైనాకు చెందిన ప్రీమియం బ్రాండ్ వన్‌ప్లస్ సహా పలు కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ల ధరలను రానున్న రోజుల్లో పెంచాలన్న ఆలోచనతో ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో తమ హ్యాండ్‌సెట్ల ధరలను పెంచనున్నట్టు వన్‌ప్లస్ స్పష్టం చేసింది. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి ధరలను సమీక్షించక తప్పదని షావోమీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.
కొత్త ఎత్తుగడ...
ఈ ఏడాది జూన్ నుంచి స్మార్ట్ ఫోన్ల తయారీ వ్యయం పెరిగిపోయింది. మే నెలలో రూపాయి 68కి పడిపోవడంతో మొబైల్స్ తయారీ సంస్థలకు కరెన్సీ తాలూకూ నొప్పి తెలియడం మొదలైంది. దీంతో అవి లాభసాటి కావనుకున్న కొన్ని మొబైల్స్‌ను ఉపసంహరించుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. అదే సమయంలో కొత్త మోడళ్లను, తమకు లాభసాటి అయిన ధరలతో మార్కెట్లోకి విడుదల చేసే పనిని చేపట్టాయి. ఫలితమే జూన్ నుంచి 250 స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విడుదల కావడం. గతేడాది ఇదే కాలంలో విడుదలైన మోడళ్ల సంఖ్య 200 వరకే ఉంది. ‘‘ఇతర సంవత్సరాల మాదిరిగా కాకుండా జూన్ నుంచి మొబైల్స్ విడుదల ఊపందుకుంది. వ్యయాలు పెరిగిపోవడంతో కంపెనీలు కొత్త మోడళ్లతో, కొత్త ధరలతో ముందుకు వచ్చాయి’’ అని ఐడీసీ ఇండియా అనలిస్ట్ జైపాల్ సింగ్ తెలిపారు. ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కండేయ కంపెనీ చర్యను సమర్థించుకున్నారు. పాత మోడళ్ల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్డడం కంపెనీ ప్రణాళికలో భాగమన్నారు. ‘‘పెరిగిన ధరల భారం మాపై ఉంది. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు వ్యయాన్ని కొంత వరకు సర్దుబాటు చేసుకున్నాం. పోటీలో నిలిచేందుకు మొత్తం భారాన్ని కస్టమర్‌కు బదిలీ చేయడం లేదు’’ అని చైనాకు చెందిన హ్యాండ్‌సెట్ సంస్థ ట్రాన్సియన్ హోల్డింగ్ సీఈవో అరీజిత్ తల్‌పాత్ర తెలిపారు. అయితే, వన్‌ప్లస్ వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్లకే పరిమితమయ్యే కంపెనీలకు ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.
ప్రముఖ కంపెనీలు సైతం...
కరెన్సీ పతనం కారణంగా పెరిగిన వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు షావోమీ, వివో, ఒప్పో, శామ్‌సంగ్ వంటి ప్రధాన కంపెనీలు కూడా నూతన మోడళ్లను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాయి. రూపాయి క్షీణత తమ అన్ని బ్రాండ్లపై భారాన్ని మోపినట్టు షావోమీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. షావోమీ ఇటీవలే ఆరు మోడళ్లను విడుదల చేసింది. కొరియాకు చెందిన శా>మ్‌సంగ్ అయితే 12 మోడళ్లను విడుదల చేయగా, ఒప్పో, వివో కంపెనీలు అర డజను వరకు మోడళ్లను విడుదల చేశాయి. అయితే, స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు దసరా–దీపావళి పండగల సీజన్‌లో ఎక్కువగా జరుగుతాయి. ఏడాదిలో మొత్తం విక్రయాల్లో 30 శాతం, ఫోన్ల విడుదలలో 60 శాతం ఈ సీజన్‌లోనే జరుగుతాయి. కానీ, ఇదే సమయంలో రూపాయి క్షీణిస్తుండడం మార్కెట్ వర్గాలను అసంతృప్తికి గురి చేస్తోంది. చైనా నుంచి విడిభాగాల దిగుమతి కోసం బల్క్ ఆర్డర్లను ఇస్తుంటే, అక్కడి కంపెనీలు తీసుకునే పరిస్థితి లేదంటున్నాయి. రూపాయి రానున్న రోజుల్లో మరింత క్షీణిస్తుందన్న అంచనాలే అక్కడి కంపెనీలు ఆర్డర్లు స్వీకరించకపోవడానికి కారణం.
మొబైల్స్‌కు రూపాయి సెగ..!
Published Thu, Oct 4 2018 1:02 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment