సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి రోజైన గత నెల 31న మార్కెట్లలో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆ ఒక్క రోజే రాజధాని వివిధ ప్రాంతాల్లోని జనసమర్థ ప్రాంతాల నుంచి 327 సెల్‌ఫోన్లను తస్కరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులందాయి.
- ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులూ పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్ చోరీల బాధితులుగా మారారు. చవితి నుంచి నిమజ్జనం వరకు 134 ఫోన్లు పోయినట్లు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి... ఇంకా అందుతున్నాయి.
- కేవలం ఈ రెండు సందర్భాలే కాదు గడిచిన కొన్నాళ్లుగా నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న పోలీసులు చోరుల కన్ను సెల్‌ఫోన్లపై ఉన్నట్లు స్పష్టమవుతోందని చెప్తున్నారు.
ఎక్కడపడితే అక్కడ ఈ నేరాలు...
రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నా, రద్దీ బస్సులో ప్రయాణిస్తున్నా, మార్కెట్‌కు వెళ్లినా, సభలు/ఉత్సవాలకు హాజరైనా అక్కడ పొంచి ఉంటున్న చోరులు స్పార్ట్ ఫోన్లను స్వాహా చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వాళ్ళు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్‌ఫోనే’ ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అధికారిక, అనధికారిక సమాచారం ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేల వరకు సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి.
- ఇటీవల పిక్‌పాకెటర్లు పర్సులు, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్‌ఫోన్లపై పడ్డారు. కొందరైతే ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి.
నిషా జోరులో, సరదా కోసం రెచ్చిపోతూ....
ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్‌ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతున్న పరిస్థితి నగర పోలీసులకు కొత్త సవాళ్ళను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో అయి ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు.
తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులు నేరగాళ్ళను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు.
పెండింగ్ భయంతోనే అధికం...
జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్‌ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. దీంతో బాధితులు నష్టపోతున్నారు.
(చదవండి: ఉదయగిరిలో బాలిక కిడ్నాప్)
Comments
Please login to add a commentAdd a comment