న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) దూకుడుగా దూసుకెడుతోంది. నిర్దేశించుకున్న గడువులోగానే నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించింది. జియోలో వాటాల విక్రయాలు, రైట్స్ ఇష్యూ ద్వారా కేవలం రెండు నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో రూ. 1.69 లక్షల కోట్లు సమీకరించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సుసాధ్యం చేసుకుంది. గతేడాది బ్రిటన్ దిగ్గజం బీపీకి తమ ఇంధన రిటైల్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ. 7,000 కోట్లు కూడా కలిపితే ఇప్పటిదాకా మొత్తం రూ. 1,75,000 కోట్లు పైగా సమీకరించినట్లయ్యింది.
‘2021 మార్చి 31 నాటికల్లా రిలయన్స్‌ను నికర రుణ రహిత కంపెనీగా చేస్తానంటూ షేర్‌హోల్డర్లకు మాటిచ్చాను. అంతకన్నా ముందుగానే సాధించాం. గడిచిన కొన్ని వారాలుగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను‘ అని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. 2020 మార్చి 31 నాటికి రిలయన్స్ నికర రుణం రూ. 1,61,035 కోట్లుగా ఉంది.
‘తాజాగా సమీకరించిన పెట్టుబడులతో కంపెనీ నికర రుణ రహిత సంస్థగా ఆవిర్భవించింది‘ అని ఆర్‌ఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియాకు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ పీఐఎఫ్‌కు 2.32% వాటాల విక్ర యం (డీల్ విలువ రూ. 11,367 కోట్లు)తో ప్రస్తుతం జియోలో ఇన్వెస్టర్లను చేర్చుకునే ప్రక్రియకు సంబంధించి తొలి దశ పూర్తయినట్లేనని వివరించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల విక్రయం ద్వారా కేవలం రెండు నెలల కన్నా వ్యవధిలోనే రూ. 1,15,694 కోట్ల పెట్టుబడులు సమీకరించింది.
ఏడాదిన్నర లక్ష్యం..
2021 మార్చి 31 నాటికి రిలయన్స్ రుణ రహిత కంపెనీగా మార్చేందుకు మార్గదర్శ ప్రణాళికను అమల్లోకి తెస్తున్నట్లు గతేడాది ఆగస్టు 12న జరిగిన రిలయన్స్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ రిటైల్, జియో, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ నిధుల ఊతంతో లక్ష్యాన్ని సాధించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ(ఆరామ్‌కో)కు 15 బిలియన్ డాలర్ల విలువ చేసే వాటాలను విక్రయించే ప్రక్రియ మొదలైంది. అయితే, పలు కారణాలతో ఆ డీల్ పూర్తి కావడంలో జాప్యం జరిగింది. ఇక రుణ రహిత సంస్థ లక్ష్య సాధనపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటిని పటాపంచలు చేస్తూ.. జియో మార్గంలో రిలయన్స్ లక్ష్యాన్ని సాధించుకుంది.
ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో అంబానీ..
తాజా పరిణామాలతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచ టాప్–10 కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ రియల్–టైమ్ బిలియనీర్ లిస్టు ప్రకారం .. ఆయన సంపద నికర విలువ 5.3 బిలియన్ డాలర్లు పెరిగి ఏకంగా 64.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.9 లక్షల కోట్లు) చేరింది. కంపెనీల షేర్ల ధరల్లో మార్పుల ప్రకారం సంపన్నుల సంపద విలువను ఫోర్బ్స్ లెక్కిస్తుంది. ఇక శుక్రవారం సాయంత్రం 7 గం.ల దాకా గణాంకాల ప్రకారం ప్రపంచ టాప్ 10 సంపన్నుల్లో అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. 64.5 బిలియన్ డాలర్ల సంపదతో గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ 10వ స్థానంలో ఉన్నారు. 158.9 బిలియన్ డాలర్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అగ్రస్థానంలోనూ, 109.4 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ రెండో స్థానం, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్‌బర్గ్ 86.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.
రిలయన్స్‌కి స్వర్ణ దశాబ్ది..
షేర్‌హోల్డర్లు, ఇతర వాటాదారుల అంచనాలకు మించిన పనితీరు పదే పదే సాధించడం రిలయన్స్ డీఎన్‌ఏలోనే ఉంది. రిలయన్స్ నికర రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించిన ఈ తరుణంలో నేనొక్క మాట చెప్పదల్చుకున్నాను. స్వర్ణ దశాబ్దిని చూస్తున్న రిలయన్స్ మరింత ఉన్నతమైన వృద్ధి లక్ష్యాలు నిర్దేశించుకుంటుందని, సాధిస్తుందని హామీ ఇవ్వ దల్చుకున్నాను.
– ముకేశ్ అంబానీ, సీఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్
Comments
Please login to add a commentAdd a comment