26,850పైన అప్‌ట్రెండ్ | above 26.850 | Sakshi
Sakshi News home page

26,850పైన అప్‌ట్రెండ్

Published Mon, Oct 27 2014 12:25 AM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM

above 26.850

మార్కెట్ పంచాంగం
 
రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయగలిగే విజయాన్ని బీజేపీ సాధించడం, డీజిల్, గ్యాస్ సంస్కరణల్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడం వంటి సానుకూలాంశాలతో భారత్ సూచీలు గతవారం అనూహ్యర్యాలీ జరిపాయి. కొన్ని కార్పొరేట్ల ఫలితాలు ఆశ్చర్యపర్చడంతో అమెరికా మార్కెట్లు కూడా నాటకీయంగా పెరగడంకూడా మన సూచీలకు ప్రోత్సాహాన్నిచ్చాయి. ప్రధాన సూచీలకంటే ముందు బ్యాంకింగ్ ఇండెక్స్ కొత్త రికార్డును నెలకొల్పినందున, బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీల్లో బ్యాంకింగ్ షేర్లకు 30 శాతంవరకూ వెయిటేజి వున్నందున, రానున్న కొద్దిరోజుల్లో భారత్ మార్కెట్ ఉన్నత శిఖరాలను అందుకునే అవకాశాలు మెరుగయ్యాయి. అక్టోబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా  షార్ట్‌కవరింగ్ జరిగితే ఈ వారం కూడా అప్‌ట్రెండ్‌లో మార్కెట్ పయనించవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...

దీపావళి రోజున జరిగిన మూరత్ ట్రేడింగ్‌తో కలిపి అక్టోబర్ 23తో ముగిసిన వారంలో 26,930 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ భారీ ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 743 పాయింట్ల లాభంతో  26,851 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ముగింపు సెన్సెక్స్‌కు కీలకమైనది. ఈ 26,850 స్థాయిపైన రానున్న రోజుల్లో స్థిరపడితే క్రమేపీ సెప్టెంబర్ 8నాటి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి 27,355 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు పెరిగిన ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మార్కెట్ ప్రారంభమైతే 27,040 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం ఎదురుకావొచ్చు. అటుపైన 27,250 పాయింట్ల వద్దకు పరుగులు తీయవచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే 27,350-27,500 శ్రేణిని చేరవచ్చు. ఈ వారం 26,850 స్థాయిపైన స్థిరపడలేకపోతే 26,500-26,670 పాయింట్ల శ్రేణి తక్షణ మద్దతు అందించవచ్చు. ఈ శ్రేణిని పరిరక్షించుకున్నంతవరకూ ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి పెరిగే అవకాశాలుంటాయి. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ మళ్లీ కరెక్షన్ బాటను పట్టి, మరోసారి అక్టోబర్ 17నాటి కనిష్టస్థాయి అయిన 25,900 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు.  

నిఫ్టీ తక్షణ నిరోధం 8,060-మద్దతు 7,930

నాలుగు వారాల తర్వాత 8,000 స్థాయిని తిరిగి చేజిక్కించుకున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, అక్టోబర్ 23తో ముగిసిన వారంలో చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 234 పాయింట్ల భారీలాభంతో 8,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పాజిటివ్‌గా మొదలైతే 8,060 స్థాయి వద్ద తక్షణ అవరోధం ఎదురుకావొచ్చు. అటుపైన 8,100 స్థాయిని చేరవచ్చు. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే 8,160-8,180 ఆల్‌టైమ్ గరిష్టశ్రేణిని అందుకునే వీలుంటుంది. ఈ శ్రేణి ఎగువన 8,250 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఈ వారం నిఫ్టీ 8,030 స్థాయిపైన స్థిరపడలేకపోతే క్రమేపీ 7,930 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 7,850 పాయింట్ల స్థాయి ముఖ్యమైన మద్దతును అందించవచ్చు. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు సందర్భంగా 7,900 స్ట్రయిక్ వద్ద అధికంగా 50 లక్షల షేర్ల పుట్ బిల్డప్ ఏర్పడగా, 8,100 స్ట్రయిక్ వద్ద భారీస్థాయిలో 64 లక్షల షేర్ల కాల్ బిల్డప్ జరిగింది. ఈ వారం నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనైన 7,900 స్థాయి మద్దతును ఇవ్వవ చ్చని, 8,100 స్థాయి నిరోధాన్ని కల్పించవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement