![Sensex gains 196 pts, Nifty tops 10850 - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/4/market.jpg.webp?itok=iLJf9chn)
వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్ బ్రేకులు వేయడం, అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల అధ్యక్షులూ త్వరలో సంతకాలు చేయవచ్చన్న వార్తలతో గతవారం పలు ప్రపంచ ప్రధాన మార్కెట్లు నెలల గరిష్టస్థాయిలో ముగిసినప్పటికీ, హఠాత్తుగా ఇండో–పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ ఫలితంగా భారత్ సూచీలు పరిమితశ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల వేగాన్ని పెంచడంతో ఇక్కడి భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపించలేదని భావించవచ్చు. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమైతే తప్ప, మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలే ఇకనుంచి మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,
సెన్సెక్స్ సాంకేతికాలు...
మార్చి 1తో ముగిసిన వారం ప్రధమార్థంలో గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 36,371 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 35,714 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గింది. చివరకు అంతక్రితంవారంకంటే 193 పాయింట్ల లాభంతో 36,064 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రికవరీ కొనసాగితే తక్షణం 36,370 పాయింట్ల స్థాయి తక్షణ అవరోధం కల్పించవచ్చు. ఆపైన 36,830 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుతర్వాత క్రమేపీ 36,170 శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోయినా, మార్కెట్ బలహీనంగా ప్రారంభమైనా 35,830 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున వేగంగా 35,715 పాయింట్ల వద్దకు పడిపోవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 35,470 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు.
తక్షణ అవరోధం 10,940
గత కాలమ్‌లో సూచించిన రీతిలోనే 10,940 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత 10,729 పాయింట్ల కనిష్టస్థాయికి నిఫ్టీ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 71 పాయింట్ల లాభంతో 10,864 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 10,940 పాయింట్ల సమీపంలో తక్షణ అవరోధం కలగవచ్చు. ఆపైన ముగిస్తే 11,040 పాయింట్ల వరకూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అటుపై 11,120 పాయింట్ల స్థాయి గట్టిగా నిరోధించవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, మార్కెట్ బలహీనంగా ప్రారంభమైనా 10,785 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున 10,730 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ దిగువన 10,630 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment