సుంకాల సమరం తీవ్రం..! | Sensex, Nifty tumble as trade war fears intensify | Sakshi
Sakshi News home page

సుంకాల సమరం తీవ్రం..!

Published Wed, Jun 20 2018 12:06 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Sensex, Nifty tumble as trade war fears intensify - Sakshi

అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌ను కూడా రెండో రోజు పడగొట్టాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం పతనం తదితర అంశాలు కూడా ప్రభావం చూపడంతో మంగళవారం స్టాక్‌ సూచీలు భారీగా నష్టపోయాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 262 పాయింట్లు క్షీణించి 35,287 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 89 పాయింట్లు పతనమై 10,710 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు రెండు వారాల కనిష్టస్థాయికి పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు పతనం కావడంతో లోహ, మైనింగ్‌ షేర్లు క్షీణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌299 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయాయి. గత 4 రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 452 పాయింట్లు నష్టపోయింది.  

నష్టాలు కొనసాగుతాయ్‌..!  
అమెరికా– చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌  చెప్పారు. ఇది మన మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని వివరించారు.

మార్కెట్‌కు ఉత్తేజాన్నిచ్చే దేశీయ సంఘటనలేమీ లేకపోవడం, రూపాయి పతనం కొనసాగుతున్న కారణంగా మార్కెట్‌ నష్టాలు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. శుక్రవారం కీలకమైన ఒపెక్‌ సమావేశం జరగనున్నదని, చమురు సరఫరాలు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో చమురు ధరలు దిగివస్తున్నాయని, దీంతో రూపాయి కోలుకునే అవకాశాలున్నాయని వివరించారు.  

మరిన్ని విశేషాలు...
మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో 4 షేర్లే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీలు మాత్రమే... అదికూడా స్వల్పంగా లాభపడ్డాయి.  
 వేదాంత షేర్‌ 3.5 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
అదానీ పోర్ట్స్, మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌ అండ్‌ టీ, ఏషియన్‌ పెయింట్స్, కోల్‌ ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, హీరో మోటో కార్ప్‌ షేర్లు 2 శాతం వరకూ నష్టపోయాయి.  
   ఒక్కో ఈక్విటీ షేర్‌కు మూడు షేర్లు బోనస్‌గా(3:1) ఇవ్వనున్నామని కంపెనీ ప్రకటించడంతో బోరోసిల్‌ గ్లాస్‌ వర్క్స్‌ షేర్‌ 15 శాతం లాభపడి రూ.1,011 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 20 శాతం ఎగసింది. బోనస్‌ షేర్ల వార్తలతో వీల్స్‌ ఇండియా షేర్‌ కూడా 17 శాతం లాభంతో రూ.2,417 వద్ద ముగిసింది.  
   వరుసగా రెండు రోజులు స్టాక్‌ మార్కెట్‌ పతనమైనప్పటికీ, ఫుట్‌వేర్‌ షేర్లు మాత్రం లాభపడ్డాయి. రిలాక్సో ఫుట్‌వేర్, బాటా ఇండియా షేర్లు ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ రెండు షేర్లతో పాటు లిబర్టీ షూస్, సూపర్‌హౌస్, ఖదీమ్‌ ఇండియా, షేర్లు 1–8 శాతం రేంజ్‌లో పెరిగాయి.  
 అల్ట్రాటెక్‌ సిమెంట్, ఎన్‌టీపీసీ, భారతీ ఇన్‌ఫ్రా , టాటా పవర్, వేదాంత, ఇండియా సిమెంట్స్, శ్రీ సిమెంట్, కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ తదితర వంద షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి.

ప్రధాన సెన్సెక్స్‌ షేర్ల నష్టాలు..
సెన్సెక్స్‌లో వెయిటేజీ బాగా ఉన్న 9 షేర్లు.. రిలయన్స్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, మహీంద్రా, వేదాంత, సన్‌ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ షేర్లు బాగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 262 పాయింట్ల నష్టంలో వీటి వాటా 199 పాయింట్లు.  

ఎందుకు ఈ పతనం...
ముదిరిన వాణిజ్య ఉద్రిక్తతలు...
అమెరికా అధ్యక్షుడు ఇటీవలే చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధించడం, దీనికి ప్రతిగా చైనా కూడా అదే స్థాయిలో అమెరికా వస్తువులపై సుంకాలు విధించడంతో ప్రపంచ మార్కెట్లు సోమవారం పతనమయ్యాయి. ఇక తాజాగా 20,000 కోట్ల డాలర్ల చైనా వస్తువులపై 10% సుంకాలను విధిస్తున్నామని ట్రంప్‌ ప్రకటించారు.

దీనికి ప్రతిగా చైనా సుంకాలు విధిస్తే మరో 20,000 కోట్ల డాలర్ల చైనా వస్తువులపై కూడా సుంకాలు విధిస్తామని ట్రంప్‌ బెదిరించారు. దీనికి ప్రతిగా 5,000 కోట్ల డాలర్ల అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తామని చైనా హెచ్చరించింది.  దీంతో ఈ అగ్ర రాజ్యాల మధ్య పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంటుందనే భయాలతో  మంగళవారం ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి.  

రూపాయి పతనం:  
డాలర్‌తో రూపాయి మారకం విలువ 40 పైసలు క్షీణించి 68.38కి చేరడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు...
మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో 1–15 మధ్య రూ.831 కోట్ల నికర అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.754 కోట్లు, మంగళవారం రూ. 1,325 కోట్ల  నికర అమ్మకాలు జరిపారు.

ఇటీవలే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పెంచడం,  ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, అక్కడి స్టాక్‌ మార్కెట్లు రోజూ గరిష్ట స్థాయిలకు చేరుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులంటున్నారు.  

ప్రపంచ మార్కెట్లు సైతం..
ఇరు అగ్ర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ సూచీ 2.9%, జపాన్‌ నికాయ్‌ 1.7%, చైనా షాంగై సూచీ 3.8% చొప్పున పతనమయ్యాయి. షాంగై సూచీ ఇంట్రాడేలో 5 శాతం క్షీణించింది. చివరకు రెండేళ్ల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. యూరప్‌ మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ఆరంభమై 1% నష్టాలతో ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement