రుణాల జారీని వేగవంతం చేయాలి
ఆసియా అభివృద్ధి బ్యాంకును కోరిన జైట్లీ
యోకోహమ: రుణాల ఆమోదం, జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)ను క్రేందం కోరింది. ఆసియా ప్రాంతంలోని వర్ధమాన దేశాలు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలపై నిధులను వెచ్చించాల్సిన అవసరం దృష్ట్యా రుణాల ఆమోదానికి ప్రస్తుతం తీసుకుంటున్న సమయాన్ని కుదించాలని విజ్ఞప్తి చేసింది. జపాన్‌లోని యోకోహమ నగరంలో జరిగిన ఏడీబీ గవర్నర్ల బోర్డు సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ... దక్షిణాసియా దేశాలకు ప్రాంతీయ కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కోరారు.
దాంతో రుణాలకు సంబంధించిన ప్రతిపాదనల పరిశీలనను వేగంగా నిర్వహించవచ్చని సూచించారు. ఏడీబీ కార్యకలాపాలు, వనరుల ప్రణాళిక విషయంలో వర్ధమాన దేశాల అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు. ఏడీబీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఇంకా నెరవేర్చాల్సి ఉన్న మరిన్ని అవసరాలపై ఆలోచనకు అవకాశం కల్పించిందన్నారు.
‘‘ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి పేదరికాన్ని పారదోలడమే ఏడీబీ ఎంచుకున్న లక్ష్యం. ఇంధనం, పట్టణాభివృద్ధి, రవాణా రంగాలతో పాటు అందుబాటు ధరలకే పునరుత్పాదక ఇంధనంపైనా మనం దృష్టి సారించాల్సి ఉంది’’ అని జైట్లీ సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఏడీబీ ప్రెసిడెంట్ టకెహికో నకావోతోనూ జైట్లీ పలు అంశాలపై చర్చలు జరిపారు.
భారత్‌లో తయారీ కేంద్రాలకు పిలుపు
జపాన్ పర్యటనలో ఉన్న జైట్లీ ఆ దేశ ఆర్థిక మంత్రి టారో అసోతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతిష్టాతక్మంగా భావిస్తున్న భారత్‌లో తయారీ కార్యక్రమం గురించి చేపడుతున్న చర్యల్ని వివరించారు. భారత్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం విషయంలో మరింత కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు సమావేశం అనంతరం విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు.