
రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు మన మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఆశావహ వృద్ధి అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 33,940 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 10,417 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ మొత్తం 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 921 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 6 వారాల గరిష్టానికి, నిఫ్టీ 4 వారాల గరిష్ట స్థాయికి ఎగిశాయి.
231 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్
లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 101 పాయింట్ల లాభంతో 33,982 పాయింట్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో 130 పాయింట్ల నష్టంతో 33,751 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది. మొత్తంగా రోజంతా 231 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆల్‌టైమ్ హైకి హెచ్‌యూఎల్: హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,420ను తాకింది. చివరకు 1.2 శాతం లాభంతో రూ. 1,409 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీని తోసిరాజని రూ.3.04 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో మార్కెట్ క్యాప్ పరంగా ఐదవ అతి పెద్ద కంపెనీగా హెచ్‌యూఎల్ అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment