మాజీ ఉద్యోగుల మోసపూరిత క్లెయిమ్‌లపై దర్యాప్తు
మిస్త్రీ ప్రకటన నేపథ్యంలో ఎయిర్ ఏషియా వెల్లడి
న్యూఢిల్లీ: మాజీ ఉద్యోగులు కొందరు అక్రమంగా వ్యక్తిగత ఖర్చులను, కొన్ని రకాల చార్జీలను క్లెయిమ్ చేసుకోవడంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా (ఇండియా) లిమిటెడ్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే కంపెనీ బోర్డ్‌కు నివేదించినట్టు, గత సమావేశంలో చర్చిం చినట్టు తెలిపింది. విచారణ జరుగుతున్నందున ఈ వ్యవహారానికి సంబంధించి ఈ దశలో ఎటువంటి ప్రత్యేక వివరాలను ప్రస్తావించదలచుకోలేదని, అలా చేస్తే అది విచారణకు ప్రతికూలంగా మారవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.అనైతిక విధానాలను సహించేది లేదని, కుట్రదారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఎయిర్ ఏసియాలో రూ.22 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఇటీవల తొలగింపునకు గురైన తర్వాత సైరస్ మిస్త్రీ బోర్డు సభ్యులకు రాసిన లేఖలో పేర్కొనటం తెలిసిందే.