
ఎయిర్‌టెల్ లాభం 54% డౌన్
క్యూ3లో రూ. 504 కోట్లు...
• నాలుగేళ్ల కనిష్టస్థాయి ఇది...
• రిలయన్స్ జియో ఉచిత ఆఫర్, పెద్ద నోట్ల రద్దు ప్రభావం..
న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి.. భారతీ ఎయిర్‌టెల్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం క్షీణించి.. రూ.503.7 కోట్లకు పరిమితమైంది. నాలుగేళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,108 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా కొత్తగా సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో ఉచిత ఆఫర్, నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా కంపెనీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. క్యూ3లో కంపెనీ ఆదాయం 3 శాతం దిగజారి... రూ.24,103 కోట్ల నుంచి రూ. 23,364 కోట్లకు తగ్గింది. ‘కొత్త ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రకటించిన ఉచిత ఆఫర్ కారణంగా అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో తీవ్ర కుదుపులను చవిచూడాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఉన్న కాల్ టెర్మినేషన్ కాస్ట్ 14 పైసలు(ఒక్కో నిమిషానికి) అనేది మాకు అవుతున్న వ్యయాల కంటే చాలా తక్కువగా ఉంది. రిలయన్స్ జియో నుంచి వస్తున్న కాల్స్ సునామీతో పరిశ్రమ ఆదాయం గతేడాదితో పోలిస్తే భారీగా పడిపోయేందుకు దారితీసింది. మార్జిన్లపై ఒత్తిడి పెరిగి.. మొత్తం దేశీ టెలికం రంగం ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోపక్క, నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కూడా క్యూ3లో ప్రభావం చూపింది.
అయితే, ఇది తాత్కాలికమేనని మేం భావిస్తున్నాం’ అని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ(ఇండియా, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంలో ఆదాయానికి సంబంధించి మొత్తం దేశీ మార్కెట్లో ఎయిర్‌టెల్ వాటా లైఫ్‌టైమ్ గరిష్టాన్ని అధిగమించి 33 శాతానికి చేరిందని తెలిపారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో గతేడాది సెప్టెంబర్‌లో 4జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట 2015 డిసెంబర్ 31 వరకూ ఉచిత డేటా, కాల్స్‌ను ఆఫర్ చేసిన జియో.. దీన్ని ఆతర్వాత ఈ ఏడాది మార్చి 31 వరకూ పొడిగించింది.
ఇతర ముఖ్యాంశాలివీ...
⇔ భారత్‌కు సంబంధించి కంపెనీ మొబైల్ సేవల ఆదాయం 1.8 శాతం వృద్ధితో రూ.18,013 కోట్లకు చేరింది. ఆదాయ వృద్ధి మందగించడానికి ప్రధానంగా జియో వాయిస్, డేటా ఉచిత ఆఫర్ కారణమని ఎయిర్‌టెల్ పేర్కొంది.
⇔ క్యూ3లో కంపెనీ కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ఆదాయం క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే దాదాపు అదేస్థాయిలో రూ.4,049 కోట్లుగా నమోదైంది.
⇔ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 22 శాతం పెరిగారు. కంపెనీ మొబైల్ డేటా ఆదాయాలు మొత్తం మొబైల్ ఆదాయాల్లో(భారత్) 22.8 శాతానికి చేరాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 23.1 శాతం వృద్ధి నమోదైంది.
⇔ భారతీయ కార్యకలాపాలకు సంబంధించి మొత్తం కస్టమర్ల సంఖ్య 9.3% వృద్ధి చెంది 26.58 కోట్లకు చేరింది. వాయిస్ కాల్ మినిట్స్‌లో 14%, డేటా వినియోగం 28.3% వృద్ధి చెందింది.
⇔ అయితే, క్యూ3లో ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం రూ.192 నుంచి రూ.172కు పడిపోయింది. దీనికి ప్రధానంగా రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ ప్రభావం చూపింది.
⇔ ఆఫ్రికాలో మొబైల్ ఆదాయం 6% వృద్ధి చెందింది. అయితే, ఇక్కడి కార్యకలాపాలపై నికర నష్టం 7.4 కోట్ల డాలర్ల నుంచి 9.3 కోట్ల డాలర్లకు ఎగబాకింది. నైజీరియా కరెన్సీ విలువ తగ్గింపు(డీవేల్యుయేషన్)... ఆఫ్రికా వ్యాపారంపై ప్రభావం చూపింది.
⇔ ఇక డిసెంబర్ చివరినాటికి ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ రుణ భారం 24 శాతం ఎగబాకి రూ.97,395 కోట్లకు చేరింది. 2015 డిసెంబర్ నాటికి రుణ భారం రూ.78,452 కోట్లుగా ఉంది.
⇔ క్యూ3లో నికర వడ్డీ వ్యయాలు రూ.1,360 కోట్ల నుంచి రూ.1,810 కోట్లకు పెరిగాయి. దీనికి స్పెక్ట్రం సంబంధిత వడ్డీ వ్యయాల పెరుగుదల కారణంగా నిలిచింది. ఇక డిసెంబర్ క్వార్టర్‌లో ఫారెక్స్, డెరివేటివ్ సంబంధ నష్టాలు రూ.57 కోట్ల నుంచి రూ. 126 కోట్లకు పెరిగాయి.
⇔ కంపెనీ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో దాదాపు 1 శాతం నష్టపోయి రూ.316 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.