సాక్షి, హైదరాబాద్: ఉచిత ఆఫర్లు, డాటా ప్రయోజనాలు అంటూ ఊదర గొట్టే టెలికాం ఆపరేటర్లు.. అంతిమంగా వినియోగదారుల నెత్తిన టోపీ పెడుతున్నాయి. దీనికి తాజా పరిణామాలే ఓ ఉదాహరణ. ఒకవైపు టెలికాం మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన రిలయన్స్ జియో టారిఫ్ రివ్యూలతో చార్జీల బాదుడుకు దిగింది. దీంతో మొబైల్ యూజర్లు భగ్గుమంటున్నారు. మరోవైపు ఈ బాదుడులో దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ కూడా తక్కువేమీ తినలేదు....అన్ యూజ్డ్ డేటా క్యారీ ఫార్వార్డ్ అంటూ.. మెసేజ్‌లతో కస్టమర్లను మభ్యపెడుతూ.. భారీ ఎత్తున చార్జీలను వడ్డిస్తోందన్న ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుడి అనుభవం ఈ ఆరోపణలను మరింత బలపరుస్తోంది.
అన్ యూజ్డ్ డాటా 4.14 జీబీ ఈ నెలకు యాడ్ అయినట్టుగా ఎయిర్ టెల్ నుంచి ఆ వినియోగదారుడికి అక్టోబర్ 17న రెండు సార్లు మెసేజ్ వచ్చింది. ఎయిర్ టెల్ అఫీషియల్ యాప్ లోనూ డాటా యాడ్ అయినట్టుగా చూపించింది. అయితే కేవలం రెండు రోజుల్లో అన్ బిల్డ్ బిల్లు మాత్రం 302గా చూపించడంతో విస్తుపోవడం కస్టమర్ వంతైంది. ఇదే విషయంపై కస్టమర్ కేర్ ను సంప్రదిస్తే మీకు ఎలాంటి డాటా ప్యాక్ లేదు. డాటా యూజ్ చేసినందుకే బిల్ పడిందన్న సమాధానం ఇచ్చింది. మరి ఎయిర్ టెల్ నుంచి మెసేజ్ ఎందుకు వచ్చింది.. యాప్ లో డాటా ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోందని ప్రశ్నిస్తే.. షరా మామూలుగానే సర్వర్ ప్రాబ్లం అనే సమాధానం రావడంతో సదరు ఎయిర్‌టెల్ యూజర్ మండి పడుతున్నారు. వాడని సేవలకు తానెందుకు భారాన్ని భరించాలని, తన లాంటి వినియోగదారులు ఇంకా ఎంతమంది ఉన్నారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వినియోగదారుల నుంచి అక్రమంగా చార్జీలను గుంజడం అన్యాయని, తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
మరోవైపు స్మార్ట్‌ఫోన్, డాటా యూసేజ్ నిత్యావసరంగా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో వినియోగదారులనుంచి అక్రమంగా అనధికారిక అధిక ఫీజులు వసూలు చేయడం నేరమని నిపుణులు పేర్కొన్నారు. వీటిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉంటూ, న్యాయపోరాటం చేయాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment