
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుస సెలవులు, సమ్మెల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు 5 రోజులు నిలిచిపోనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) డిసెంబరు 21న సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 22 నాలుగో శనివారం, 23వ తేదీ ఆదివారం కావడంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు. 24వ తేదీ (సోమవారం) బ్యాంకులు తెరుస్తారు. 25వ తేదీ క్రిస్మస్ సెలవు. డిసెంబరు 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు దిగుతోంది.
ఈ లెక్కన 24వ తేదీ మినహాయిస్తే డిసెంబరు 21 (శుక్రవారం) నుంచి 26 (బుధవారం) వరకు బ్యాంకు సేవలు స్తంభించనున్నాయి. అన్ని స్థాయిల్లోనూ వేతన సవరణతోపాలు పలు డిమాండ్ల సాధన కోసం అసోసియేషన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. డిసెంబరు 21 సమ్మెలో దేశవ్యాప్తంగా 3.2 లక్షల మంది అధికారులు పాల్గొంటున్నారు. మరోవైపు, డిసెంబర్ 21న సమ్మె తలపెట్టినప్పటికీ ఏటీఎంలు యథాప్రకారం పనిచేస్తాయని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తెలిపింది. ఏటీఎంలను బలవంతంగా మూయించివేసే ప్రయత్నాలేమీ ఉండబోవని ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబరు 26 సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment