ఆదాయంతో పాటు పొదుపూ పెరగాలి!
రఘు, ఆనంద్... ఇద్దరూ ఉద్యోగస్తులే. ఇద్దరూ పొదుపరులే. ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయటం ఇద్దరికీ అలవాటు. అయితే రఘు ప్రతినెలా రూ.5000 చొప్పున పొదుపు చేయటం మొదలెట్టాడు. ఆనంద్ కూడా అలాగే మొదలుపెట్టినా... మొదటి ఏడాది గడిచాక జీతం పెరగటంతో పొదుపు మొత్తాన్ని కూడా పెంచాడు. అంతేకాదు! ప్రతి ఏటా కొంత మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. పదేళ్లు తిరిగేసరికి ఏం జరిగిందో తెలుసా? ఆనంద్ పొదుపు రూపంలో పెంచింది కొద్ది మొత్తం. కానీ అతనికి సమకూరిన నిధిలో మాత్రం భారీ తేడా కనిపించింది.
ఎంత తేడా అంటే... రఘు సమకూర్చుకున్న నిధికన్నా రెట్టింపు!!. మామూలు ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు రిటైర్మెంట్ తరవాత కూడా డబ్బు రావాలంటే ఒకే ఒక మార్గం పొదుపు. ప్రతినెలా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ... ఏడాదికోసారి పొదుపు మొత్తాన్ని పెంచుకుంటూ వెళితే రిటైర్మెంట్ సమయానికి భారీ నిధిని సమకూర్చుకోవచ్చు. అదెలాగో అంకెల్లో చూద్దాం.
* క్రమం తప్పకుండా పెంచుకుంటే భారీ నిధి
* ఎంత త్వరగా పొదుపు మొదలుపెడితే అంత బెటర్
మరో చిన్న ఉదాహరణ చూద్దాం. ముందే అనుకున్నట్లుగా ఆనంద్ ప్రతి ఏటా కొంత మొత్తాన్ని పెంచుకుంటూ పొదుపు చేస్తూ వెళ్తున్నాడు. అయితే సుధీర్ మాత్రం మూడేళ్లకోసారి పెంచుదామని అనుకున్నాడు. అలా పెంచే మొత్తం ఆనంద్ పెంచే మొత్తంకన్నా కాస్త ఎక్కువే ఉండేది. కానీ చివర్లో ఇద్దరి చేతికీ వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను చూస్తే... ఇక్కడా ఆనంద్‌దే పైచేయి. అంటే... క్రమం తప్పకుండా పద్ధతిగా పెంచుకుంటూ వెళితే కలిగే ప్రయోజనం ముందు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకేసారి పెంచటం వల్ల కలిగే ప్రయోజనం తక్కువే. అది అంకెల్లో ఒకసారి చూద్దాం...త్వరగా సేవింగ్స్ ప్రారంభించండి...
ఎవ్వరికైనా నా సలహా ఏంటంటే... సేవింగ్స్‌ను ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. కాంపౌండింగ్ ప్రక్రియ పోర్ట్‌ఫోలియోపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 25 ఏళ్ల వయసులో నెలకు రూ.5,000 చొప్పున (10 శాతం వడ్డీరేటు) పొదుపు చేయటం మొదలు పెడితే... అతనికి 55 ఏళ్లు వచ్చే సరికి సేవింగ్స్ మొత్తం దాదాపుగా రూ.1.15 కోట్లు ఉంటుంది. అలాగే మరో వ్యక్తి కాస్త ఆలస్యంగా... అంటే 30 ఏళ్ల వయసులో నెలకు అదే రూ.5,000 చొప్పున పొదుపు చేయటం మొదలుపెడితే... 55 ఏళ్లు వచ్చేసరికి అతనికి జమయ్యే మొత్తమెంతో తెలుసా?
రూ.67 లక్షలు. అంటే కేవలం ఐదేళ్లు ఆలస్యంగా మొదలుపెట్టినందుకు తనకు రూ.48 లక్షల వరకు తక్కువ వచ్చిందన్న మాట. నిజానికి తొలి ఐదేళ్లూ ఆయన పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ.60 వేలు చొప్పున ఐదేళ్లకు ఆయన పొదుపు చేసేది కేవలం రూ.3 లక్షలు. ఆ మొత్తాన్ని తొలి ఐదేళ్లలో పొదుపు చేయలేదు కనక ఆయన నష్టపోయింది రూ.48 లక్షలు. అదే కాంపౌండింగ్ మహిమ. అందుకే పొదుపు ఎంత త్వరగా ఆరంభిస్తే అంత మంచిది.
ఇక మీ చేతుల్లో గనక డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే... ఆ పొదుపును ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళితే ఇంకా మంచిది. పొదుపు చేయడానికి బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్లే కాదు. మ్యూచ్‌వల్ ఫండ్లు, షేర్లు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి. వీటిలో రెగ్యులర్‌గా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో పొదుపు చేయటం ఉత్తమం. అలాగే ఎమర్జెన్సీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చి ఆర్థిక పరిస్థితులు తలకిందులైతే ఇది మనల్ని ఆదుకుంటుంది.4 నుంచి 6 నెలల పాటు ఏ ఢోకా లేకుండా గడిపేయటానికి సరిపడేలా ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్లలో ఆలస్యం జరగకుండా డెరైక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఆటోమేటిక్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్స్‌కు నగదును పంపే విధానాన్ని అవలంబించండి. ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ప్రణాళికలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ వెళ్లాలి.
మన ఆదాయంతో నిమిత్తం లేకుండా రఘు మాదిరి ప్రతి నెలా ఒకే స్థిర మొత్తంలో (రూ.5,000) ఇన్వెస్ట్ చే స్తూ వెళితే .. అది పదేళ్లలో (10 శాతం వడ్డీ రేటు) రూ.49.7 లక్షలు అవుతుంది. అలా కాకుండా ఆనంద్ మాదిరిగా ఆదాయం పెరుగుదలతోపాటు ఇన్వెస్ట్‌మెంట్ ను కూడా పెంచుకుంటూ వెళితే (అంటే ఆదాయం ఎంతైనా అందులో 25 శాతం).. అదే పదేళ్ల కాలంలో, అదే 10 శాతం వడ్డీ రేటులో మన సేవింగ్స్ మొత్తం రూ.1.05 కోట్లు అవుతుంది. అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. చూడండి ఎంత తేడా ఉందో.
ఇక్కడ శ్రీధర్ మాదిరి ఫిక్స్‌డ్ సేవింగ్స్ విధానంలో చివర్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెంచినప్పుడు వచ్చే మొత్తం రూ.72 లక్షలుగా ఉంది. ఇది ఆనంద్ చేసిన డైనమిక్ సేవింగ్స్ విధానంలోని మొత్తం రూ.1.05 కోట్ల కన్నా తక్కువగానే ఉంది.