న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ మార్కెట్ లీడర్ ‘మారుతీ సుజుకీ’కి చెందిన ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కారు ‘ఆల్టో’ వరుసగా 14వ సారి కూడా దేశీ మార్కెట్‌లో అత్యధికంగా విక్రయమైన మోడల్‌గా అవతరించింది. ఆల్టోకి డిజైర్ గట్టిపోటినిచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అల్టో విక్రయాలు 2,58,539 యూనిట్లుగా నమోదయ్యాయి.
వార్షిక ప్రాతిపదిన 7 శాతం వృద్ధి కనిపించింది. ఇక మారుతీ డిజైర్ అమ్మకాలు 20 శాతం వృద్ధితో 2,40,133 యూనిట్లకు ఎగశాయి. దీంతో డిజైర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మారుతీ బాలెనో మూడో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 58 శాతం వృద్ధితో 1,90,480 యూనిట్లకు చేరాయి.
మారుతీ స్విఫ్ట్, మారుతీ వేగనార్ మోడళ్లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటి విక్రయాలు వరుసగా 1,75,298 యూనిట్లుగా, 1,68,644 యూనిట్లుగా ఉన్నాయి. ఇక వీటి తర్వాతి స్థానాల్లో వరుసగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, విటారా బ్రెజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హ్యుందాయ్ క్రెటా, మారుతీ సెలెరియో నిలిచాయి. టాప్–5లోని మోడళ్లన్నీ మారుతీవే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment