
బీవోటీ ప్రాజెక్టులపై అంబికా గ్రూప్ ఫోకస్
అగర్‌బత్తీల తయారీ, ఆతిథ్య రంగంలో ఉన్న అంబికా గ్రూప్ బీవోటీ ప్రాతిపదికన నిర్మాణ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అగర్‌బత్తీల తయారీ, ఆతిథ్య రంగంలో ఉన్న అంబికా గ్రూప్ బీవోటీ ప్రాతిపదికన నిర్మాణ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.75 కోట్ల విలువైన మూడు కమర్షియల్ ప్రాజెక్టులను గ్రూప్ విజయవంతంగా పూర్తి చేసి నిర్విహ స్తోంది. గ్రూప్ కంపెనీ అయిన ఫైన్ గ్రీన్ కన్‌స్ట్రక్షన్స్ భారత్‌లో తొలిసారిగా మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్‌ను తమిళనాడులో నిర్మించింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) ప్రాజెక్టులను చేపట్టబోతున్నట్టు ఫైన్ గ్రీన్ కన్‌స్ట్రక్షన్స్ డెరైక్టర్ అంబికా రామచంద్రరావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.60 కోట్లు ఉంటుందన్నారు. ‘ప్రధాన ప్రాంతాల్లో సొంతంగా స్థలం కొనుగోలు, కాంప్లెక్సు నిర్మాణం ఖరీదైన అంశం. అందుకే బీవోటీ విధానానికే మొగ్గు చూపుతున్నాం. అవకాశం ఉన్నచోట ఉత్తమ ప్రాజెక్టులను చేపట్టేందుకు మేం సిద్ధం’ అని వెల్లడించారు.
మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్
తమిళనాడులోని సాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ‘అంబికా వీజీ కాంప్లెక్స్’ పేరుతో నిర్మించిన మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్‌కు (ఎంఎఫ్‌సీ) నవంబరు 30న ప్రారంభోత్సవం చేయనున్నారు. భారత్‌లో ఇదే తొలి మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్ కావడం విశేషం. రైలు ప్రయాణికులకు వినూత్న సౌకర్యాలు, సేవలు కల్పించేందుకు ఢిల్లీ రైల్వేస్‌తో కలిసి ఫైన్ గ్రీన్ కన్‌స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్టును చేపట్టిందని రామచంద్ర రావు తెలిపారు. హోటల్, వసతి గృహం, రెస్టారెంట్, దుకాణాలు, ఆఫీస్ స్పేస్, కార్ల పార్కింగ్‌కు విశాల స్థలం ఈ కాంప్లెక్స్‌లో అదనపు ఆకర ్షణ అని చెప్పారు. మూడు అంతస్తుల్లో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. 45 ఏళ్ల పాటు కంపెనీ ఈ కాంప్లెక్స్‌ను నిర్వహించనుంది. కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10 కోట్లకుపైగా వ్యయం చేశారు.