భారత్‌లో ఉద్యోగ నియామకాలు
భారత్‌లో ఉద్యోగ నియామకాలు
Published Mon, Sep 11 2017 3:29 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM
న్యూయార్క్ : అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఏఎండీ (అడ్వాన్స్ మైక్రో డివైజెస్) భారత్‌లో ఉద్యోగాల నియామకాలకు ప్లాన్‌చేస్తోంది. ఇప్పటికే భారత్‌లో 1,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ సంస్థ, తన రెండు ఆర్ అండ్ డీ సెంటర్లు బెంగళూరు, హైదరాబాద్‌లలో మరింత మంది ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతమున్న సెంటర్లలో మరింత వృద్ధి కొనసాగించాలనుకుంటున్నామని, ప్రతి సైట్‌లో ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నామని ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ ఆండర్‌సన్ చెప్పారు. అయితే ఎన్ని ఉద్యోగాలు కల్పించనుందో మాత్రం ఏఎండీ స్పష్టంచేయలేదు. కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏమన్నా ఏర్పాటుచేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా అలాంటి ప్రణాళికలేమీ ప్రకటించలేదన్నారు. ప్రస్తుత సెంటర్లనే బలోపేతం చేయాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎక్కువ అడ్వాన్ ఇంజనీరింగ్ పని ఇక్కడే జరుగుతున్న కారణంతో ఈ సెంటర్లను బలోపేతం చేయాలకుంటున్నట్టు తెలిపారు. ఏఎండీ రైజెన్ మొబైల్ ప్రాసెసర్ కోసం ఎక్కువ ఇంజనీరింగ్ పని హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఏఎండీకి భారత్ అత్యంత కీలకమైన మార్కెట్‌గా ఉంది. పీసీ వ్యాపారాలకు ఇది అతిపెద్ద మార్కెట్ అని ఆండర్‌సన్ చెప్పారు. కొత్త ఉత్పత్తులతో తన మార్కెట్ షేరును మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారుల పీసీల కోసం రైజెన్ 3, 5, 7లను కంపెనీ లాంచ్ చేసింది. కమర్షియల్ పీసీల కోసం రైజెన్ ప్రొ అనే కొత్త మైక్రోప్రాసెసర్ చిప్స్‌ను గతవారంలోనే ఏఎండీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Advertisement
Advertisement