సగం మంది ఉద్యోగులు అమెరికన్లే: విప్రో
బెంగళూరు: అమెరికాలోని తమ కార్యాలయాల్లో స్థానిక ఉద్యోగుల సంఖ్య సగానికి పైగానే ఉందని ఐటీ దిగ్గజం విప్రో వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో స్థానిక నిపుణులకు శిక్షణనిచ్చి సుమారు 1,600 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,000 మంది స్థానికులు చేరారని, దీంతో అమెరికాలో మొత్తం సిబ్బంది సంఖ్య 14,000కు చేరినట్లు విప్రో వివరించింది.
నెక్ట్స్ జనరేషన్ లోకల్ డెలివరీ సెంటర్స్ ఏర్పాటు చేసిన ఫ్లోరిడా, కాలిఫోర్నియా, జార్జియా, టెక్సాస్ రాష్ట్రాల్లో తలో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. గత దశాబ్ద కాలంలో తాము 2 బిలియన్ డాలర్ల పైగా అమెరికాలో ఇన్వెస్ట్ చేశామని, స్థానికంగా ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని విప్రో సీఈవో ఆబిదాలి నీముచ్‌వాలా తెలిపారు.