
గుర్గావ్: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి ప్రత్యేక విధానమేదీ లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరికాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. భారత్‌లో ఈ రంగం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందని, విధి విధానాల రూపకల్పన కూడా క్రమంగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహీంద్రా–టెరి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఈ విషయాలు చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించిందని, అయితే రెడీమేడ్‌గా సమగ్ర విధానమేదీ లేదంటూ కేంద్రాన్ని తప్పుపట్టలేమని ఆయన పేర్కొన్నారు. దీన్ని రూపొందించేందుకు ప్రైవేట్ రంగంతో కూడా సంప్రదింపులు జరుపుతోందని ఆనంద్ మహీంద్రా వివరించారు.
2030 నాటికి ప్రజా రవాణా వ్యవస్థలో పూర్తిగాను, ఇతరత్రా వ్యక్తిగత వాహనాలకు సంబంధించి కనీసం 40 శాతం మేర ఎలక్ట్రిక్ వాహనాల వినియోగ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలంటూ నీతి ఆయోగ్ గతేడాది అభిప్రాయపడింది. అయితే, ఇందుకు సంబంధించి కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల విధానమేదీ రూపొందించే యోచనేదీ లేదంటూ కేంద్రం ఫిబ్రవరిలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.