న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన డైమండ్ వ్యాపారి, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ పత్రాలతో రుణాలు పొంది రూ 14,000 కోట్లకు పైగా పీఎన్‌బీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని అంటిగ్వా ప్రభుత్వం నిర్ణయించింది. చోక్సీ పౌరసత్వంపై విచారణ చేపట్టామని, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి భారత్‌కు అప్పగించే ప్రక్రియ చేపడతామని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆర్థిక నేరాల్లో పాలుపంచుకున్న నేరగాళ్లకు అంటిగ్వాను సురక్షిత ప్రదేశంగా మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రుణ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ దేశం విడిచి అంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీ అప్పగింత ప్రక్రియ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. చోక్సీ తన వాదనను సమర్ధించుకోవడంలో విఫలమై, న్యాయ ప్రక్రియలో చేతులెత్తేసిన అనంతరం ఆయనను అప్పగిస్తామని హామీ ఇస్తున్నామని అంటిగ్వా ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని అప్పగించాలన్న భారత్ పిటిషన్‌ను బ్రిటన్ కోర్టులో ఎదుర్కొంటున్నారు. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌లను బ్రిటన్ కోర్టులు పలుమార్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment