ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది వేతన జీవులకు నిరాశే ఎదురవనుందని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. వేతనాల్లో రెండంకెల వృద్ధి ఇక గత వైభవంగా మిగిలిపోనుందని ఆ సర్వే వెల్లడించింది. 2019లో సగటు వేతన పెంపు భిన్న రంగాల్లో 9.7 శాతంగా ఉంటుందని హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ సంస్థ ఏఆన్ అంచనా వేసింది.
2017లో సగటు వేతన వృద్ధి 9.3 శాతం, 2018లో 9.5 శాతం కాగా ఈ ఏడాది స్వల్పంగా వేతన వృద్ధి పెరిగినా రెండంకెల వృద్ధికి దూరంగా నిలవడంతో వేతన జీవులకు నిరాశ మిగలనుంది. 2007లో సగటు వార్షిక వేతన వృద్ధి అత్యధికంగా 15.1 శాతం నుంచి ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ వచ్చిందని ఏఆన్ హెవిట్ వెల్లడించిన డేటా తెలిపింది.
ఎన్నికల ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యయాలు పెరిగినా 2020లో మెరుగైన వేతన వృద్ధిని అంచనా వేయవచ్చని, అయినా 12-13 శాతం వేతన వృద్ధి మాత్రం గత వైభవంగానే మిగులుతుందని తాము అంచనా వేస్తున్నామని ఏఆన్ ఎమర్జింగ్ మార్కెట్స్ హెడ్, భాగస్వామి అనందర్ప్ ఘోష్ స్పష్టం చేశారు.
కీలక నైపుణ్యాలు కలిగిన వారికే మెరుగైన వేతన వృద్ధి పరిమితమవుతందని, సగటు వేతన పెంపు మాత్రం వృద్ధి చెందదని అంచనా వేశారు. ఈ ఏడాది కేవలం ఇంటర్‌నెట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సేవలు, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, కన్జూమర్ ఉత్పత్తుల రంగాల్లోనే రెండంకెల వేతన వృద్ధి పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment