
ఐఫోన్ 7 ఫీచర్స్ లో మరో రూమర్
ఐఫోన్ 7ను యాపిల్ ఎప్పుడు మార్కెట్లోకి ప్రవేశపెడుతుందో ఏమో కాని..విడుదల తేదీ నుంచి ఫీచర్ల వరకూ అన్నీ రూమర్లు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఒకరు హెడ్ జాక్ ఉండదంటే. మరొకరు యూనీకోడ్ మెటల్ గ్లాస్, ఫాస్టర్ టచ్ ఐడీతోనే ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటున్నారు. ఇప్పుడు మరో కొత్త రూమర్. ఐఫోన్ 7ను యాపిల్ మూడు డిస్ ప్లే వేరియంట్లలో ప్రవేశపెట్టబోతున్నారని టాక్. 4, 4.7, 5.5 అంగుళాల్లో ఈ ఫోన్ ను యాపిల్ తీసుకురాబోతుందట. స్టాండర్డ్ వేరియంట్లకు 2జీబీ ర్యామ్, హైయర్ మోడల్స్ కు 3జీబీ తో రూపొందించబోతుందని తెలుస్తోంది. డ్యూయల్ కెమెరా ప్రత్యేకతలు, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, ఏ10 చిప్ ను దీనిలో పొందుపరిచారని రిపోర్టులు తెలుపుతున్నాయి.
ఇటీవలే ఐఫోన్ 7 ఇమేజ్ కూడా లీక్ అయింది. ఈ ఇమేజ్ ఫోన్ ను మొత్తం యూనీకోడ్ మెటల్ గ్లాస్ తో రూపొందించినట్టు చూపుతోంది. ఆంటీనా తీగలు ఫోన్ కు పైనా, కింద అమర్చబడట్టు చూపుతున్నాయి. ఈ లీకేజీ ఇమేజ్ లో కెమెరా హార్డ్ వేర్ కు, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాస్ కు మధ్యలో ఒక అదనపు రహస్య రంధ్రం ఉంది. శబ్దాలను నిరోధించే మైక్రోఫోన్ తో ఈ ఐఫోన్ 7 మార్కెట్లోకి రాబోతుందని రిపోర్టు చెబుతుండటంతో, ఈ రహస్య రంధ్రం మైక్రోఫోన్ నేమో అని భావిస్తున్నారు. లేజర్ ఆటోఫోకస్ మోడ్యుల్ గా రెండో రంధ్రం ఉండబోతుందని, ఇది తక్కువ వెలుతురులో కూడా క్లారిటీగా ఇమేజ్ ను తీయగలదని తెలుస్తోంది. అదేవిధంగా స్మార్ట్ కనెక్టర్ తో ఐఫోన్ 7ను రూపొందించబోతున్నారని టాక్. సెప్టెంబర్ లోనే ఈఫోన్ ప్రవేశపెడుతున్నారని మార్కెట్ వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి.