బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ అదే!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 7’ నిలిచింది. 2017 మొదటి త్రైమాసికంలో 2.15 కోట్ల ‘ఐఫోన్ 7’ యూనిట్లు అమ్ముడయినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ మార్కెట్‌లో జరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో ఇది ఆరు శాతంగా నమోదైంది. 1.74 కోట్ల హ్యాండ్‌సెట్ల అమ్మకాలతో యాపిల్ కంపెనీకే చెందిన ఐఫోన్ 7 పస్ స్మార్ట్‌ఫోన్ రెండో స్థానంలో నిలిచింది.
అంతర్జాతీయంగా 2017 మొదటి త్రైమాసికంలో 35.33 కోట్ల స్మార్ట్‌ఫోన్లు సేల్ అయినట్టు స్ట్రాటజీ ఎనలిటిక్స్ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్-5 స్మార్ట్‌ఫోన్లలో రెండు యాపిల్ కంపెనీవే కావడం విశేషం. 89 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఒప్పో ఆర్9ఎస్ మూడో స్థానంలో ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ జే3, శామ్‌సంగ్ గెలాక్సీ జే5 నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. కాగా, భారత్‌లో టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 5ఎస్’ అవతరించింది.