జూన్‌లో సేవలు జూమ్!
♦ ఎనిమిది నెలల గరిష్టానికి నికాయ్ సూచీ
♦ ఆర్డర్లు పెరిగిన నేపథ్యం
న్యూఢిల్లీ: సేవల రంగం జూన్‌లో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. నికాయ్ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం, మేలో 52.2 వద్ద ఉన్న సూచీ, జూన్‌లో 53.1కి ఎగసింది. నికాయ్ సూచీ 50 పాయింట్ల పైన వుంటే దానిని వృద్ధిగా ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. తాజా నెల సమీక్షలో సూచీ భారీగా పెరగడానికి ‘సేవల విభాగ ఆర్డర్లు’ పెరగడం ప్రధాన కారణం. సేవల రంగం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో సగటున 51.8గా ఉంది.
జనవరి–మార్చి త్రైమాసికంలో పేలవంగా ఉన్న వృద్ధి ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొంత పటిష్టమయ్యే వీలుందని తాజా గణాంకాలు పేర్కొంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా తయారీ రంగం వృద్ధి మాత్రం జూన్‌లో దాదాపు అక్కడక్కడే ఉంది. మేలో 52.5 స్థాయిలో ఉన్న సూచీ, జూన్‌లో 52.7 పాయింట్లకు చేరింది. అయితే ఇది కూడా ఎనిమిది నెలల గరిష్ట స్థాయి.