ఈ ఏడాది సాయం 4.5 బిలియన్‌ డాలర్లు  | Asian Development Bank to scale up lending to 4.5 billion in 2019 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది సాయం 4.5 బిలియన్‌ డాలర్లు 

Published Sat, Jan 12 2019 1:02 AM | Last Updated on Sat, Jan 12 2019 1:02 AM

Asian Development Bank to scale up lending to 4.5 billion in 2019 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌కు ఇచ్చే నిధుల సాయాన్ని 2019లో 4.5 బిలియన్‌ డాలర్ల(రూ.31,500 కోట్లు)కు పెంచనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. పెట్టుబడుల వృద్ధికి తోడు, జీఎస్టీ స్థిరపడటంతో ఆదాయాలు పెరుగుతాయన్న అంచనాల మేరకు ఈ గణాంకాలను ప్రకటించింది.

‘‘భారత్‌కు 2019లో నిధుల సాయాన్ని 4.5 బిలియన్‌ డాలర్లకు పెంచనున్నాం. ఇందులో 3.5 బిలియన్‌ డాలర్లు భారత ప్రభుత్వానికి, మరో బిలియన్‌ డాలర్లు ప్రైవేటు రంగానికి ఇవ్వనున్నాం’’ అని ఏడీబీ ఇండియా డైరెక్టర్‌ కెనిచి యోకోయమ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. 2018లో భారత్‌కు 3.03 బిలియన్‌ డాలర్ల సౌ ర్వభౌమ రుణాలు ఇచ్చేందుకు కట్టుబడినట్టు చెప్పా రు. ఓ ఏడాదిలో ఇదే గరిష్టమన్నారు. దీనికి అదనం గా ప్రైవేటు రంగానికి 557 మిలియన్‌ డాలర్ల రుణాలిచ్చినట్టు తెలిపారు. ప్రాజెక్టుల సంసిద్ధతపై నిధుల సాయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.  

వృద్ధి పుంజుకుంటుంది... 
కేంద్ర ప్రభుత్వ గణాంకాల విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేయగా, ఏడీబీ అంచనాలు 7.3 శాతంగా ఉన్నాయి. 2019–20లో వృద్ధి పుంజుకుంటుందని ఏడీబీ సీనియర్‌ ఎకనమిక్స్‌ అధికారి అభిజిత్‌సేన్‌ గుప్తా పేర్కొన్నారు. జీఎస్టీ అమలు, డీమోనిటైజేషన్‌ కారణంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోయాయని, చమురు ధరల తగ్గుదల గృహ వినియోగాన్ని పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ద్రవ్యపరిమితులు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు వృద్ధికి సవాళ్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కరెంటు ఖాతా లోటు 2.5 శాతంగా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది.  

ఆర్థిక సూత్రాలకు విరుద్ధం 
వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఆర్థిక సూత్రాలకు వ్యతిరేకమని, సాగు రంగంలో సంక్షోభానికి ఇది తగిన పరిష్కారం కాదని కెనిచి యోకోయమ అభిప్రాయపడ్డారు. లబ్ధిదారులకు నేరుగా నిధులను బదిలీ చేయడం వల్ల దుర్వినియోగం తగ్గుతుందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో రూ.1.47 లక్షల కోట్ల మేర వ్యవసాయ రుణాల బకాయిలు ఉండగా, వీటిని మాఫీ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటనలు వెలువడిన విషయం తెలిసిందే. కేంద్రం సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని ఎంత సమర్థవంతంగా, ఏ రూపంలో అమలు చేయగలదన్న దానిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని యోకోయమ అన్నారు. ద్రవ్యలోటును ప్రభుత్వం చేరుకునే విషయంలో తమకు ఎటువంటి సందేహం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement