
యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ తగ్గింపు
వివిధ కాలాలకు 0.70% వరకూ కోత
ముంబై: పెద్దనోట్ల రద్దుతో వచ్చిన భారీ డిపాజిట్లు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) నేపథ్యంలో రేటు కోత నిర్ణయం తీసుకుంటున్న పలు బ్యాంకుల జాబితాలో తాజాగా యాక్సిస్ బ్యాంక్ చేరింది. దేశంలో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల తర్వాత మూడవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ లెండింగ్ ఆధారిత రుణ (ఎంసీఎల్‌ఆర్) రేటును 70 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. శుక్రవారం సమావేశం అయిన బ్యాంక్ అసెట్ లైబిలిటీ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందనీ, ఈ నిర్ణయం జనవరి 18 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా రేట్లు ఇలా...: వార్షిక ఎంసీఎల్‌ఆర్ 0.65% తగ్గి 8.25 శాతానికి చేరింది. బ్యాంక్ ఓవర్‌నైట్ (ఒకరోజు) రుణ రేటు కూడా 0.65 శాతం తగ్గి 7.90 కి చేరింది. అత్యధికంగా 0.70 శాతం తగ్గింపు 3, 6 నెలల కాలానికి వర్తిస్తుంది. 3 నెలల రేటు 8.05 తగ్గుతుండగా, ఆరు నెలల రేటు 8.15%కి చేరింది.
ఇప్పటికి ఇంతే...: ఇంతకుమించి రుణరేటు కోత అవకాశం ప్రస్తుతానికి లేదని ట్రెజరీ హెడ్ శశికాంత్ రాఠీ అన్నారు. ఆర్‌బీఐతన రెపో రేటు తగ్గించినా... లేక తక్కువస్థాయిలో వడ్డీ చెల్లించే డిపాజిట్లు పెరిగినా తదుపరి కోత నిర్ణయం ఉంటుందన్నారు. ఇటీవలే 0.10% వరకూ బేస్‌రేట్‌ను బ్యాంక్ తగ్గించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.