బ్యాంకులకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్!
బ్యాంకులకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్!
Published Sat, Dec 10 2016 5:27 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
ఆర్థికమంత్రిత్వ శాఖ బ్యాంకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అధికారులెవరు అక్రమాలకు పాల్పడినా వదిలేది లేదంటూ, ఎవరూ కూడా తప్పించుకోలేరంటూ శనివారం మరోసారి హెచ్చరించింది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మంత్రిత్వశాఖ చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొంతమంది బ్యాంకు అధికారులు పలు అక్రమాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. వారు నల్లకుబేరులతో చేతులు కలిసి రద్దైన నోట్లను వైట్మనీగా మార్చడానికి సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న 27 మంది ప్రభుత్వ బ్యాంకు అధికారులను ప్రభుత్వం డిసెంబర్ 2న సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురిని ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేసింది.
మంగళవారం కూడా అక్రమాలకు తెరతీస్తున్నారనే ఆరోపణలతో యాక్సిస్ బ్యాంకుకు చెందిన 19 మంది అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగులందరిపై ఆర్థికమంత్రిత్వశాఖ కన్నేసి ఉంచిందని, పాత కరెన్సీ నోట్లను కొత్త నోట్లగా మారుస్తూ పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. గతవారంలోనూ ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేజర్లను దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ అదుపులోకి తీసుకుంది. వారి దగ్గర్నుంచి మూడు కేజీల కంటే ఎక్కువ బరువున్న బంగార కడ్డీలను స్వాధీనం చేసుకుంది. వారిని డిసెంబర్ 12 వరకు తమ కస్టడీలోకి ఈడీ తీసుకుంది.
Advertisement
Advertisement