తెలిసిన సంఘటనలు ‘బేర్’మనిపించలేవు.. | Axis Mutual Fund, a senior fund manager Sudhanshu courts | Sakshi
Sakshi News home page

తెలిసిన సంఘటనలు ‘బేర్’మనిపించలేవు..

Published Mon, Aug 3 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

తెలిసిన సంఘటనలు ‘బేర్’మనిపించలేవు..

తెలిసిన సంఘటనలు ‘బేర్’మనిపించలేవు..

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ సుధాంశు ఆస్థానా
 
♦ ఊహించనివేవైనా జరిగితేనే మనకు ఇబ్బంది
♦ మన మార్కెట్లు ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్నాయి
♦ మన వడ్డీ రేట్లు ఏడాదిలో మరో శాతం తగ్గొచ్చు
♦ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్నాం
 
 ముందునుంచే ఊహిస్తున్న సంఘటనలు మార్కెట్లపై స్వల్పకాల ప్రభావాన్ని చూపుతాయని, ఇలాంటి వాటిని కొనుగోళ్లకు ఉపయోగించుకోవాలంటోంది యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ. దేశీయ స్టాక్ సూచీలు ఫండమెంటల్‌గా బలంగా ఉన్నాయని, ఊహించని సంక్షోభం ఎదురైనపుడు మాత్రమే ఇవి కిందకు పడతాయని చెబుతున్న యాక్సిస్ ఎంఎఫ్ సీనియర్ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) సుధాంశు ఆస్థానాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ...

 స్టాక్ సూచీలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరాక కాస్త ఆగుతున్నాయి. అలాంటపుడు రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారు? సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమైనా పెరిగాయా?
 దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో మా ఒక్క యాక్సిస్ మ్యూచువల్ ఫండ్‌లో చేరిన 10 లక్షల మంది ఖాతాదారుల్లో రెండు లక్షల మంది తొలిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినవారే. పరిశ్రమలో సిప్ ఖాతాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతి నెలా సగటును రూ.2,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నారు.

 కొద్ది వారాలుగా మార్కెట్లు పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. వచ్చే ఏడాదిలో..?
 ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థగా మార్కెట్లు ఎంత లాభాలందిస్తాయనేది చెప్పలేను. కానీ ఇండియా ఆర్థిక వృద్ధిరేటు వచ్చే ఏడాదిలో పదేళ్ల సగటు జీడీపీ 6.5 శాతం (పాత జీడీపీ లెక్కల్లో) దాటుతుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం జీడీపీ రేటు 5 శాతం (పాత లెక్కల ప్రకారం) దగ్గర ఉండొచ్చు. దేశంలోని 10,000 కంపెనీల పదేళ్ల లాభాల సగటు 11 శాతంగా ఉంటే అది ఇప్పుడు 4.5 శాతంగా ఉంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ పూర్వవైభవానికి వస్తే కంపెనీల లాభాలు కూడా ఆ స్థాయికి చేరుతాయి. ఇదే సమయంలో ఈక్విటీ ఫండ్స్ సగటున 15 శాతం రాబడిని అందించాయి. ఇవన్నీ ఫండమెంటల్ పరంగా దీర్ఘకాలానికి ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించే అంశాలే.

 అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ పెంచితే ఎలా ఉంటుంది?
 అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుండటంతో వడ్డీరేట్ల పెంపు తప్పనిసరి అనేది అందరికీ తెలిసిందే. కానీ అది ఎప్పటి నుంచనేది తెలియాల్సి ఉంది. ఇలా తెలిసిన సంఘటనలు మార్కెట్లపై అంతగా ప్రతికూల ప్రభావాన్ని చూపలేవు. ఆ సమయంలో కాస్త ఒడిదుడుకులు వస్తే రావచ్చు. అమెరికా వడ్డీరేట్లు పెంచినా ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఫండమెంటల్‌గా మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. అదికాకుండా గత మూడేళ్లలో ఎఫ్‌ఐఐలు దీర్ఘకాలిక దృష్టితో ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఇలా తెలిసిన సంఘటనలు జరిగినప్పుడు వచ్చే పతనాలను కొనుగోళ్లకు ఉపయోగించుకోమని సూచిస్తా.

 అమెరికా వడ్డీరేట్లు పెంచితే డాలరు బలపడి రూపాయి మరింత బలహీన పడుతుందా? వచ్చే ఏడాది కాలంలో డాలరు విలువ ఏ స్థాయిలో ఉంటుంది?
 ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగా ఉంది. రూపాయి మరింత క్షీణించకుండా ఆర్‌బీఐ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ అమెరికా వడ్డీరేట్లు పెంచడం వల్ల డాలరు విలువ బలపడినా ఆ ప్రభావం మన కరెన్సీపై అంతగా ఉండకపోవచ్చు. డాలరు విలువ ఏ శ్రేణిలో కదులుతుందో చెప్పలేను. ఏటా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 2-3% తగ్గుతోంది. రానున్న కాలంలో కూడా ఇదే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.

 చైనా మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. మనపై ఎంత ప్రభావం ఉండొచ్చు?
 చైనా మార్కెట్లతో ఇండియాకు నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు. మెటల్స్ ధరలు బాగా తగ్గుతుండటంతో ఆ రంగంపై ఎక్కువగా ఆధారపడిన చైనా పడుతోంది. చైనా మార్కెట్లు భారీగా పడినప్పుడు సెంటిమెంటల్‌గా మన మార్కెట్లు కూడా కాస్త ఒత్తిడికి లోను కావచ్చు కానీ, దీర్ఘకాలిక ర్యాలీపై ప్రభావం చూపలేదు.

 ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందా? వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు ఏ విధంగా ఉండొచ్చు?
 ఈ నెలలో వడ్డీరేట్లు తగ్గుతాయా లేదా అనేది చెప్పలేం. కానీ వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు 0.75-1 శాతం తగ్గే అవకాశాలున్నాయి.

 ప్రస్తుతం ఏ రంగాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు?
 మేం మార్కెట్‌తో సంబంధం లేకుండా బోటమ్ అప్ ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని అనుసరిస్తాం. భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న రంగాల్లో ఫండమెంటల్‌గా, యాజమాన్య, నిర్వహణ పరంగా పటిష్టంగా ఉన్న కంపెనీలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై ఆసక్తి చూపిస్తున్నాం. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా, మెటల్స్ రంగాల్లో ఎంపిక చేసిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఏ ఒక్క రంగంలో 10 శాతం మించి ఇన్వెస్ట్ చేయటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement