సమాజానికి ప్రేమతో రూ.52,700 కోట్లు! | Azim Premji commits Rs 1.45 lakh crore, 67 per cent stake in Wipro to philanthropy | Sakshi
Sakshi News home page

సమాజానికి ప్రేమతో రూ.52,700 కోట్లు!

Published Thu, Mar 14 2019 12:18 AM | Last Updated on Thu, Mar 14 2019 9:10 AM

Azim Premji commits Rs 1.45 lakh crore, 67 per cent stake in Wipro to philanthropy - Sakshi

న్యూఢిల్లీ: విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసం మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్‌ విలువ రూ.52,700 కోట్లుగా అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తన ప్రకటనలో తెలిపింది. దీంతో తన ఫౌండేషన్‌ కార్యక్రమాలకు ప్రేమ్‌జీ కేటాయించిన మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్‌ డాలర్లు) చేరింది. ఇందులో విప్రోలోని 67 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ప్రేమ్‌జీనే వ్యవహరిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన గతంలోనే భారీ కేటాయింపులు జరపగా, తాజాగా వీటిని మరింత పెంచారు. 2018 డిసెంబర్‌ నాటికి విప్రోలో ప్రమోటర్‌ హోల్డింగ్‌ 74.3 శాతంగా ఉంది.

దేశంలో విద్యా సంబంధిత కార్యక్రమాలతోపాటు పలు ఇతర విభాగాల్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సాయం అందిస్తోంది. కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్‌లో ఫౌండేషన్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు కోసం ఇనిస్టిట్యూషన్లను ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. వచ్చే కొన్నేళ్లలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్టు ఫౌండేషన్‌ తెలిపింది. ఉత్తరభారత్‌లోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. సమానత, మానవతతో కూడిన స్థిరమైన సమాజం కోసం అన్నది ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ లక్ష్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement