న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు ఇంకా ఇంకా గుదిబండగా మారుతున్నాయి. మంగళవారం ఫలితాలు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లకు ఫలితాలపై మొండి బకాయిలు తీవ్రమైన ప్రభావాన్నే చూపించాయి. ఆ వివరాలివీ...
పీఎన్‌బీ లాభం సగం...
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మొండి బకాయిల కేటాయింపులు దెబ్బతీశాయి. ఈ కేటాయింపుల కారణంగా బ్యాంక్ నికర లాభం సగానికి పైగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.721 కోట్ల నికర లాభం ఆర్జించామని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.1,405 కోట్లు)తో పోల్చితే 49 శాతం క్షీణించిందని వివరించింది.
గత క్యూ1లో రూ.19,603 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.25,397 కోట్లకు పెరిగాయని పేర్కొంది. శాతాల్లో చెపితే ఇది 5.48 శాతం నుంచి 6.47 శాతానికి పెరిగిందని వివరించింది. కేటాయింపులు రూ.928 కోట్ల నుంచి రూ.1,811 కోట్లకు పెరిగాయని పేర్కొంది.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ బ్యాంక్ షేర్లు 5 శాతం వృద్ధితో రూ.142 వద్ద ముగిశాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 84% డౌన్
జూన్ క్వార్టర్‌కు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.130 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభంతో (రూ.806 కోట్లు) పోలిస్తే ఏకంగా 84 శాతం క్షీణత నమోదైంది. గతేడాది క్యూ1లో రూ.893 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో రూ.1,515 కోట్లకు పెరిగాయని, లాభం తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని తెలియజేసింది. స్థూల నిరర్థక ఆస్తులు 3.2 శాతం (రూ.12,532 కోట్లు) నుంచి 6.8 శాతానికి (రూ.26,889 కోట్లు) ఎగబాకాయి.
యూనియన్ బ్యాంక్ కేటాయింపులు రెట్టింపు
యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.519 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నికర లాభం (రూ.664 కోట్లు)తో పోల్చితే 22 శాతం క్షీణత నమోదైంది. మొత్తం ఆదాయం రూ.8,548 కోట్ల నుంచి రూ.9,043 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు రెట్టింపయ్యాయని, రూ.393 కోట్ల నుంచి రూ.642 కోట్లకు పెరిగాయని తెలియజేసింది.
స్థూల మొండి బకాయిలు 4.27 శాతం (రూ.10,232కోట్లు) నుంచి 5.53 శాతానికి (రూ.14,144 కోట్లకు), నికర మొండి బకాయిలు 2.71 శాతం నుంచి 3.08 శాతానికి ఎగిశాయని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,117 కోట్ల నుంచి రూ.2,130 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.783 కోట్లకు పెరిగాయని వివరించింది. అయితే మొండి బకాయిలను నియంత్రిస్తామని బ్యాంక్ సీఎండీ అరుణ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 2 శాతం వృద్ధితో రూ.157 వద్ద ముగిసింది.
సిండికేట్ బ్యాంక్ లాభం రూ.302 కోట్లు
సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.302 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.485 కోట్లు)తో పోల్చితే 38 శాతం క్షీణత నమోదైంది. మొత్తం ఆదాయం రూ.5,523 కోట్ల నుంచి రూ.6,323 కోట్లకు పెరిగిందని బ్యాంకు పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 2.97 శాతం నుంచి 3.72 శాతానికి, వడ్డీ ఆదాయం రూ.5,067 కోట్ల నుంచి రూ.5,823 కోట్లకు పెరిగిందని వివరించింది. ఫలితాల నేపధ్యంలో బీఎస్‌ఈలో ఈ బ్యాంక్ షేర్ 9 శాతం క్షీణించి రూ.90 వద్ద ముగిసింది.
బ్యాంకులకు మొండి బకాయిల బండ
Published Wed, Jul 29 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement
Advertisement