బ్యాంక్ షేర్లు బేర్
రిజర్వ్ బ్యాంక్ ఒత్తిడి పరీక్ష(స్ట్రెస్ టెస్ట్) కారణంగా బ్యాంక్ షేర్లు కుదేలవడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాలపాలయ్యింది. రుణ సంక్షోభ నివారణకు గ్రీస్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవడంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనమవడం కూడా తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 84 పాయింట్లు నష్టపోయి 27,812 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 8,381 పాయింట్ల వద్ద ముగిశాయి. 1930 నాటి మహా మాంద్యం నాటి సమస్యల వలయంలోకి ప్రపంచం జారిపోయే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళనవ్యక్తం చేయడం ప్రభావం చూపింది.
మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 496 పాయింట్లు(1.8 శాతం), నిఫ్టీ 156పాయింట్లు(1.9 శాతం) లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో వారమూ లాభాల్లోనే ముగిసింది. బ్యాంక్‌ల అసెట్ క్వాలిటీ క్షీణత మరికొన్ని క్వార్టర్లు కొనసాగే అవకాశం ఉందంటూ ఆర్‌బీఐ ఒత్తిడి పరీక్ష(స్ట్రెస్ టెస్ట్) వెల్లడించడం బ్యాంక్ షేర్లపై ప్రభావం చూపింది. ఆర్‌బీఐ ఒత్తిడి పరీక్ష బ్యాంక్ షేర్లపై అమ్మకాల ఒత్తిడిని పెంచింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ 1.5 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.3 శాతం, ఫెడరల్ బ్యాంక్ 1.3 శాతం, యస్ బ్యాంక్ 0.9శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.9 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 0.3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.2 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ బ్యాంకింగ్ ఇండెక్స్ 0.7 శాతం క్షీణించి 21,059 వద్ద ముగిసింది.
లాభ, నష్టాలు...
30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,489 షేర్లు నష్టాల్లో, 1,185 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,056 కోట్లుగా, ఎన్‌ఎన్‌ఈ నగదు విభాగంలో రూ.14,485 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,45,005 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.204 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.234 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
ఆర్‌బీఎల్ బ్యాంక్, కాఫీ డే.. ఐపీఓ పత్రాల దాఖలు
న్యూఢిల్లీ: ఆర్‌బీఎల్ బ్యాంక్ (గతంలో రత్నాకర్ బ్యాంక్) ఐపీఓకు రానున్నది. ఈ బ్యాంక్‌తో పాటు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ కూడా ఐపీఓకు రానున్నది. ఈ రెండు సంస్థలు ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించాయి. ఐపీఓల ద్వారా ఆర్‌బీఎల్ బ్యాంక్ రూ.1,100 కోట్లు, కేఫ్ కాఫీ డే రూ.1,150 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి.
వచ్చే వారంలో ఇండిగో ఐపీఓ పత్రాలు
ఇండిగో బ్రాండ్ కింద విమానయాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ వచ్చే వారం ఐపీఓకు సంబంధించిన పత్రాలను సెబీకి సమర్పించనున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించాలనేది కంపెనీ ఆలోచన.