ఏటీఎం పరిమితుల అమలుకు బ్యాంకుల వెనుకంజ?
న్యూఢిల్లీ: మెట్రో నగరాల్లో సొంత కస్టమర్లకు ఏటీఎం లావాదేవీల పరిమితులపై బ్యాంకులు ఆలోచనలోపడ్డాయి. తమ సొంత కస్టమర్లకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితి విధింపును దిగ్గజ బ్యాంకులైన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు వంటివి ఇంకా ప్రకటించలేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
ఏటీఎంల వాడకంపై పరిమితి విధిస్తే.. బ్యాంకు బ్రాంచీల్లో కస్టమర్ల తాకిడి పెరిగిపోతుందనే ఆందోళనే దీనికి కారణమని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి చెప్పారు. నగదు విత్‌డ్రాయల్స్ లేదా ఇతర సేవల కోసం బ్రాంచ్‌లకు కస్టమర్ పదేపదే రావడం వల్ల బ్యాంకులకు ఖర్చు కూడా ఎగబాకుతుందని... ఇది రూ.20 కంటే ఎక్కువే ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌తో సహా ఆరు మెట్రోల్లో సొంత బ్యాంకులకు సంబంధించి నెలకు ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను ఐదుకు పరిమితం చేసేలా ఆర్‌బీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంల వాడకాన్ని ఇప్పుడున్న ఐదు నుంచి మూడు లావాదేవీలకు తగ్గించేందుకు ఓకే చెప్పింది. ఈ మార్పులు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాలెన్స్ ఎంక్వయిరీ ఇతరత్రా ఏవైనాకూడా లావాదేవీల కిందే పరిగణిస్తారు.
ఈ పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.20 చొప్పున ఫీజును బ్యాంకులు వసూలు చేసుకోవచ్చు. అయితే, సొంత బ్యాంకుల ఏటీఎంల విషయంలో నెలకు ఎన్ని ఉచిత లావాదేవీలను అనుమతించాలన్నది ఆయా బ్యాంకులే నిర్ణయించుకోవచ్చని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అనవసరంగా ఖర్చును పెంచుకునే బదులు... బ్యాంకులు తమ సొంత కస్టమర్లకు నెలకు ఐదు కంటే ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం లావాదేవీలను అనుమతించే అవకాశం ఉందని.. ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల ఏటీఎం వాడకంపై పరిమితుల్ని మాత్రం అమలుచేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.
గ్రామీణ బ్యాంకుల్లోనూ కేవైసీ కఠినం..
ఖాతాదారులు తమ చిరునామా ఇతరత్రా వివరాలకు(నో యువర్ కస్టమర్-కేవైసీ) సంబంధించి నిబంధనలను పాటించకపోతే వాళ్ల అకౌంట్లను పాక్షికంగా స్తంభింపజేయాలని రీజినల్ రూరల్ బ్యాంకులు, సెంట్రల్ కోపరేటివ్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆదేశించింది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.Follow @sakshinews