బీఏఎస్‌ఎఫ్ నుంచి వరి సస్యరక్షణ ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న జర్మనీ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్ భారత మార్కెట్లో వరి సస్యరక్షణ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వరికి సోకే వ్యాధులు, కలుపు, తెగుళ్ల నుంచి రక్షణ కల్పించడమేగాక అధిక దిగుబడులు ఈ ఉత్పత్తుల ప్రత్యేకత అని కంపెనీ క్రాప్ ప్రొటెక్షన్ విభాగం ప్రెసిడెంట్ మార్కస్ హెడెట్ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు రామన్ రామచంద్రన్, రాజేంద్ర వెలగల తదితరులతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి 130 నూతన ఉత్పాదనలతోపాటు మరో 250 ఇతర ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం బీఏఎస్‌ఎఫ్‌కు భారత వరి సస్యరక్షణ ఉత్పత్తుల మార్కెట్లో 3–4 శాతం వాటా ఉంది. దీనిని 10%కి చేర్చనున్నట్టు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో బీఏఎస్‌ఎఫ్ ఇప్పటికే రూ.1,000 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా వరిని పండిస్తున్న భారత్‌లో రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు కొనసాగించనున్నట్టు తెలిపింది.