పర్యాటకులు సెలవుల్లో ఏఏ ప్రాంతాలు చుట్టి రావాలన్న ప్రణాళికకే ఎంతో సమయం, కష్టాన్ని వెచ్చిస్తుంటారు. అయితే, ఎక్కువ మంది ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను మాత్రం పట్టించుకోరు. ప్రయాణ సమయాల్లో ప్రమాదాలు, అనారోగ్యం పాలయ్యే రిస్క్ ఉంటుంది. ఊహించని, దురదృష్టకర ఘటనలు జరగకుండా తప్పించుకునే మార్గం లేదు. పర్యాటక బీమా అన్నది ఈ తరహా ప్రమాదాలు జరగకుండా నిరోధించలేదు. కానీ, ఈ తరహా సందర్భాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ పర్యాటకులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రమాదాలు లేదా ప్రయాణ సమయాల్లో అనారోగ్యం పాలైతే, ఎదురయ్యే వైద్య ఖర్చులను ఈ బీమా భరిస్తుంది. కొన్ని దేశాల్లో వైద్య చికిత్సల వ్యయాలు భారీగా ఉంటాయని తెలుసుకోవాలి. దీంతో తీవ్రమైన గాయాల పాలయితే పర్యాటకులు వేలాది డాలర్లను వైద్య బిల్లుల రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే పర్యాటక ఇన్సూరెన్స్ ఉంటే తమ వైద్యం కోసం చేసిన ఖర్చులను రీయింబర్స్‌మెంట్ రూపంలో తిరిగి పొందొచ్చు. పైగా వైద్య పరంగా అత్యవసర తరలింపునకు అయ్యే ఖర్చులను కూడా పాలసీదారులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరో ముఖ్యమైన ప్రయోజనం... ట్రిప్‌ను రద్దు చేసుకుంటే, లేదా అవాంతరాలు ఎదురైనా కవరేజీ లభిస్తుంది. పర్యటనకు ముందుకానీ, పర్యటన సమయంలో కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, పర్యాటకులు తమ పర్యటనలను కుదించుకోవడం లేదా రద్దు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల భారీ మొత్తంలో నష్టపోతుంటారు.
ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ తరహా పర్యటనల రద్దు, కుదింపు సమయాల్లో ఎదురయ్యే నష్టాలకు పరిహారాన్ని చెల్లిస్తుంది. ఈ పాలసీ ఉండడం వల్ల బ్యాగేజీ లేదా వ్యక్తిగత వస్తువులు కోల్పోయినా, పరిహారం పొందొచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవరేజీ లభించే వాటిల్లో వ్యక్తిగత బాధ్యత, పర్యటన ఆలస్యం, ప్రమాద మరణం, భౌతిక కాయాన్ని తరలించడం, దంత వైద్య వ్యయాలకూ కవరేజీ ఉంటుంది. కేవలం పర్యటనల సమయాల్లో కవరేజీకే పరిమితం కాకుండా, ఊహించని ఘటనలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి, ముఖ్యమైన సౌకర్యాలు ఇతర సమాచారాన్ని పాలసీదారులు రోజులో 24 గంటల పాటు పొందే అవకాశం కూడా ఉంది. ప్రయాణ సమయంలో డాక్యుమెంట్లు పోయినా పాలసీ ఆదుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలసి చేసే పర్యటనలు ఎంతో అనందాన్నిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, బయటకు వెళ్లినప్పుడు ముప్పు లేదా ప్రమాదాలు ఎదురుకాకుండా బయటపడే ఎటువంటి మార్గం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా కానీ ఏదైనా ట్రిప్‌కు వెళ్లి రావాలనుకుంటే, అది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో అయినా కానీ, ముందుగా ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు కూడా ప్లాన్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment