సబ్సిడీ తోడ్పాటుతో బీపీసీఎల్‌కు లాభాలు
నికర లాభం రూ.551 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.551 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇంధన అమ్మకాలపై వచ్చిన నష్టాలకు పూర్తి పరిహారం లభించడమే దీనికి కారణమని వివరించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో నిల్వ నష్టాలు రూ.1,600 కోట్లుగా ఉన్నప్పటికీ ఈ స్థాయి నికర లాభం సాధించామని బీపీసీఎల్ పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం రూ.1,080 కోట్ల నగదు సబ్సిడీని, ఓఎన్‌జీసీ వంటి అయిల్ అప్‌స్ట్రీమ్ కంపెనీలు రూ.2,333 కోట్లు చెల్లించాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,089 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ3లో రూ.64,768 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ క్యూ3లో రూ.57,915 కోట్లకు, స్థూల రిఫైనింగ్ మార్జిన్ 1.76 డాలర్ల నుంచి 1.54 డాలర్లకు తగ్గిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ఎన్‌ఎస్‌ఈలో 2.7 శాతం వృద్ధితో రూ.725కు పెరిగింది.