
ఎయిర్‌టెల్ డేటా బూస్ట్
క్యూ2లో 10% పెరిగిన నికర లాభం; రూ. 1,523 కోట్లు...
* ఆదాయం రూ.23,836 కోట్లు
* డేటా ఆదాయం 50 శాతం అప్
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలానికి రూ.1,523కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ఆర్జించిన నికర లాభం(రూ.1,383 కోట్లు)తో పోల్చితే 10 శాతం వృద్ధి సాధించామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. మొబైల్ డేటా వినియోగం భారీగా పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ చెప్పారు.
గత క్యూ2లో రూ.22,845 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 4.3 శాతం వృద్ధితో రూ.23,836 కోట్లకు పెరిగిందని వివరించారు. స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ను వినియోగించే వారి సంఖ్య బాగా పెరుగుతుండటంతో మొబైల్ డేటా ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.3,806 కోట్లకు పెరిగిందని, ఇది మొత్తం ఆదాయంలో 16 శాతమని, గత క్యూ2లో ఇది 11 శాతమని పేర్కొన్నారు. డేటా ట్రాఫిక్ 76 శాతం ఎగసిందని తెలిపారు. ఇబిటా రూ.7,749 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.8,265 కోట్లకు పెరిగిందని, ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు డేటా ఆదాయం రూ.42 నుంచి రూ.193కు వృద్ధి చెందిందని గోపాల్ వివరించారు.
మూడేళ్లలో అధిక వృద్ధి
భారత్‌లో ఆదాయ వృద్ధి 13 శాతం పెరిగిందని, మూడేళ్లలో ఇదే అత్యధికమని గోపాల్ పేర్కొన్నారు. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే వాయిస్ మినిట్స్ తగ్గాయని తెలిపారు. గత క్యూ2లో 3,42,987గా ఉన్న వాయిస్ మినిట్స్ ఈ క్యూ2లో 3,36,002 కు తగ్గిపోయాయని వివరించారు. 334 నగరాల్లో 4జీ సర్వీసులనందిస్తున్నామని, పలు సర్కిళ్లలో 3జీ సర్వీసులందిస్తున్నామని, ఈ కారణంగా భారత మొబైల్ పరిశ్రమలో వేగంగా వృద్ధి చెందుతున్న డేటా మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు.
ఈ క్యూ2లో రూ.3,102 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రుణభారం రూ.70,777 కోట్లుగా ఉందని. అఫ్రికా కార్యకలాపాల నష్టం 12.4 కోట్ల నుంచి 17 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌కు 20 దేశాల్లో మొత్తం 34 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో 2 శాతం(రూ.7) క్షీణించి రూ.352 వద్ద స్థిరపడింది.