ఐదేళ్లలో నిఫ్టీ @30,000
♦ మోర్గాన్ స్టాన్లీ అంచనా
♦ నిఫ్టీ ఎర్నింగ్స్ వచ్చే ఐదేళ్లలో 20 శాతం వృద్ధి
♦ దీర్ఘకాలంలో సూచీలు పైపైకే....
న్యూఢిల్లీ: నిఫ్టీ ఇంకా 10,000 పాయింట్లను కూడా క్రాస్ చేయలేదు. భవిష్యత్తులో సూచీలు ఏ స్థాయికి చేరతాయన్న అంచనాల విషయంలో ఇన్వెస్టర్లలో ఎన్నో అంచనాలు, సందేహాలు ఉండి ఉండొచ్చు. కానీ, ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ మాత్రం నిఫ్టీ వచ్చే ఐదేళ్లలో 30,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని అంటోంది. సమీప కాలంలో అంటే ఈ నెలలోనే సెన్సెక్స్ 34,000 వరకూ పెరగొచ్చంటోంది. ‘‘2003 నుంచి 2007 మధ్య ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. నిఫ్టీ ఎర్నింగ్స్ (కాంపౌండెడ్) 39 శాతంగా ఉంది. అప్పుడు సూచీ ఏడు రెట్లు పెరిగింది. వచ్చే ఐదేళ్ల కాలంలో ఎర్నింగ్స్ 20 శాతం (కాంపౌండెడ్)గా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఇది సూచీని 30,000కు తీసుకెళుతుంది. ఇవి మోస్తరు అంచనాలే’’ అని మోర్గాన్ స్టాన్లీ ఎండీ రిధమ్ దేశాయ్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇంత భారీ అంచనాల వెనుక...
జీడీపీలో లాభాల వాటా జీవిత కాల కనిష్ట స్థాయిలో ఉండడమే ఈ అంచనాల వెనుకనున్న పెద్ద కారణంగా దేశాయ్ తెలిపారు. ఇది అక్కడే స్థిరంగా ఉండకుండా తిరిగి కోలుకుంటుందన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. వినియోగం పుంజుకోవడం, వేతనాలు పెరుగుదల, ఎగుమతుల్లో వృద్ధి, ప్రభుత్వ వ్యయాలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఉండడం ఇవన్నీ కూడా జీడీపీలో లాభాల నిష్పత్తిని పెంచేవే. కాకపోతే ప్రైవేటు మూలధన వ్యయం ఒక్కటే చప్పగా ఉంది. అయితే, ఇది కూడా వచ్చే ఏడాదిలో రికవరీ అవుతుంది. మార్కెట్ ఏకధాటిగా ముందుకు వెళ్లదు కానీ, ఇది బాగా స్థిరపడిన బుల్‌మార్కెట్ అని చెప్పొచ్చు. దీర్ఘకాలానికి ఇది మరింత పైకి వెళుతుందని ఆశించొచ్చు’’ అని దేశాయ్ వివరించారు. అధిక వ్యాల్యూషన్స్‌వల్ల 3–6 నెలల కాలానికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చని, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
వ్యాల్యూషన్స్ భారీగా ఏం లేవు...
‘‘వ్యాల్యూషన్స్‌పై ఆందోళన లేదు. స్మాల్, మిడ్ క్యాప్ విభాగంలోనే వ్యాల్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆదాయాలు క్షీణించినందున పీఈ మల్టిపుల్స్ తక్కువగానే ఉన్నాయి’’ అని దేశాయ్ వివరించారు. అమెరికాతో పోలిస్తే మన మార్కెట్ల వ్యాల్యూషన్స్ కొంచెం అధికంగా, వర్ధమాన దేశాలతో పోల్చుకుంటే సగటు కంటే ఎక్కువగా ఉన్నాయని.. అధిక వృద్ధి కారణంగా ఇది సబబేనన్నారు.
స్వల్ప కాలంలో కరెక్షన్
స్వల్ప కాలంలో జీఎస్టీ కారణంగా మార్కెట్లలో కరెక్షన్ చోటు చేసుకోవచ్చని దేశాయ్ పేర్కొన్నారు. మోర్గాన్ స్టానీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలోని సగం మేర సంస్థలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీని అమలు చేసేందుకు ఇంకా సన్నద్ధం కాలేదని తేలిపాయి. దీంతో స్వల్ప కాలంలో వృద్ధికి విఘాతం కలుగుతుందని, మార్కెట్లు దీనికి ప్రతికూలంగా స్పందించొచ్చని... అంతర్జాతీయ అంశాలు కూడా తోడైతే నిఫ్టీ 5–10 శాతం మేర నష్టపోవచ్చని దేశాయ్ అన్నారు.
ర్యాలీలో పాల్గొనే రంగాలు...
ఆర్థిక సేవలకు చెందిన కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు), ఆ తర్వాత వినియోగంపై ఆధారపడే కంపెనీలు బుల్ ర్యాలీని ముందుకు తీసుకెళ్లే వాటిలో ఉంటాయని దేశాయ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో 20+ వయసులో ఉన్నవారు ఎక్కువ మంది రుణాలు తీసుకుంటున్నారని, దీంతో రుణాలకు డిమాండ్ ఉంటుందన్నారు. తలసరి ఆదాయం పెరుగుతోందని, ఆహారేతర వినియోగ డిమాండ్ కు ఊతమిస్తుందన్నారు. ప్రభుత్వ బ్యాంకులు మార్కెట్ వాటాను మరింత కోల్పోతాయని, ఈ షేర్లు ట్రేడింగ్ కోసమేగానీ పెట్టుబడుల కోసం కాదని అభిప్రాయపడ్డారు.