మన ఫార్మాకు అమెరికా గండం! | Biocon set to seek USFDA approval for biosimilars | Sakshi
Sakshi News home page

మన ఫార్మాకు అమెరికా గండం!

Published Tue, Feb 9 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

మన ఫార్మాకు అమెరికా గండం!

మన ఫార్మాకు అమెరికా గండం!

గతేడాది రికార్డు స్థాయిలో హెచ్చరికలు
25 కంపెనీల్లో జరుగుతున్న ఎఫ్‌డీఏ దర్యాప్తు

ఫార్మా కంపెనీల లాభాలు; ఎగుమతులపై ఒత్తిడి
ఎంఎన్‌సీల హస్తం ఉందంటూ సందేహాలు!
అమెరికా జెనరిక్ మార్కెట్లో భారత్ హవానే కారణం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ;మన ఫార్మా సంస్థలు తయారు చేసేవన్నీ జెనరిక్ మందులే. వాటికి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అమెరికా. అక్కడి నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతిస్తేనే... ఏ కంపెనీ అయినా తన మందుల్ని విక్రయించగలుగుతుంది. అలాంటి యూఎస్‌ఎఫ్‌డీఏ... మునుపెన్నడూ లేని తీరులో దేశీ ఫార్మా కంపెనీలపై కొరడా ఝుళిపిస్తోంది. 2015లో రికార్డు స్థాయిలో మన క ంపెనీలకు 17కు పైగా వార్నింగ్ లేఖలొచ్చాయి.

25కి పైగా  కంపెనీలకు చెందిన యూనిట్లలో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు కూడా చేస్తోంది. ఈ వార్నింగ్ లెటర్లు అందుకున్న వాటిలో దిగ్గజాలు సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నుంచి చిన్న స్థాయి పాన్ డ్రగ్స్, మైక్రో ల్యాబ్ వరకు అనేక కంపెనీలున్నాయి.  2008 నుంచి ఇప్పటి వరకు దేశీ కంపెనీలకు 50కిపైగా హెచ్చరిక లేఖలు వచ్చాయి. కానీ 2015లో ఈ సంఖ్య బాగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే ఇప్కా ల్యాబ్‌కు చెందిన మూడు యూనిట్లకు వార్నింగ్ లెటర్లు అందాయి. ఈ వ్యవహారం దేశీ ఫార్మా రంగ అమ్మకాలపై... ప్రత్యేకించి ఫార్మా రాజధానిగా ముద్రపడ్డ హైదరాబాద్‌పై కూడా పడే అవకాశముందన్నది నిపుణుల మాట.

దేశీయ కంపెనీలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి వార్నింగ్ లేఖలు, ఇంపోర్ట్ అలర్ట్స్ రావడం వెనుక బహుళజాతి కంపెనీల లాబీయింగ్ పనిచేస్తోందా? అన్న సందేహాలకు పలు వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. అమెరికా జెనరిక్ మార్కెట్లో దేశీ కంపెనీలు దూసుకుపోతుండటమే దీనికి కారణమని ఫార్మా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేవలం ఏడేళ్లలో అంతర్జాతీయ జెనరిక్ ఎగుమతుల్ని రెట్టింపు చేయటమే కాకుండా... అమెరికాలో మార్కెట్లో 5 శాతానికి పైగా వాటాను చేజిక్కించుకుని దేశీ కంపెనీలు ఎంఎన్‌సీలకు సవాల్ విసురుతున్నాయి. 2008లో 7.8 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు 16.5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2020 నాటికి ఈ విలువ 28 బిలియన్ డాలర్లకు చేరుతుందనేది అంచనా. ఈ దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి యూఎస్‌ఎఫ్‌డీఏను అడ్డం పెట్టుకొని ఎంఎన్‌ఎసీలు తెరవెనుక లాబీయింగ్ చేస్తున్నాయని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని ఓ ఫార్మా సంస్థ ప్రతినిధి చెప్పారు.

 మన అలవాట్లూ ఓ కారణమే!
దేశీ కంపెనీలు అందుకుంటున్న హెచ్చరికల లేఖల్లో స్వయంకృతం కూడా కనిపిస్తోంది. ‘‘అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసే యూనిట్లలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. వారిలో అవగాహనా లోపం వల్లే ఈ లేఖలొస్తున్నాయి’’ అని ఫార్మాక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ చెప్పారు. ‘‘మన కంపెనీలు తయారు చేసే ఔషధాల నాణ్యతపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులూ లేవు. కొన్ని యూని ట్లలో గుడ్ ప్రాక్టీసింగ్ విధానాలు అమలు చేయకపోవడం... డాక్యుమెంటేషన్, డేటా ఇంటిగ్రిటీలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపైనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ యూనిట్లలో అనుసరించాల్సిన విధానాలపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించడానికి యూఎస్‌ఎఫ్‌డీఏ సభ్యులతో కేంద్ర వాణిజ్య శాఖ వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తోంది. మరోవంక దేశీ వాతావరణ పరిస్థితులపై ఎఫ్‌డీఏ సిబ్బందికి అవగాహన కల్పించడానికి డీసీజీఐ, ఫార్మాక్సిల్, వాణిజ్య మంత్రిత్వ శాఖ సిబ్బంది మార్చిలో అమెరికాకు వెళ్తున్నారు’’ అని వివరించారాయన.

అనుమతులపై ఒత్తిడి...
దేశీ కంపెనీలు వార్నింగ్ లెటర్లు అందుకుంటుండంతో కొత్త ఔషధాలకు అనుమతులు రావటం ఆలస్యం కావచ్చని, కంపెనీల లాభాలు తగ్గవచ్చని ‘ఇక్రా’ నివేదిక పేర్కొంది. గత పదేళ్ల చరిత్రను చూస్తే వార్నింగ్ లేఖల్లో 40 శాతం కేసులే ఇంపోర్ట్ అలర్ట్‌ల వరకు వెళుతున్నాయని ఇక్రా తెలిపింది. పెద్ద ఫార్మా కంపెనీలు సగటున ఏడాదిలోగా వార్నింగ్ లేఖల సమస్యను పరిష్కరించుకుంటున్నట్లు తెలియజేసింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 25 కంపెనీలకు సంబంధించి 50కిపైగా యూనిట్లలో తనిఖీలు జరుగుతున్నాయి. వీటివల్ల కొత్త జెనరిక్‌ల విడుదల ఆలస్యమయ్యే అవకాశముంది.

ఇదే ధోరణి కొనసాగితే ఎగుమతులు కూడా తగ్గే అవకాశం ఉందని పీడబ్ల్యూసీ పేర్కొంది. ఫార్మాక్సిల్ మాత్రం ఇంతవరకు  వార్నింగ్ లేఖల ప్రభావం ఎగుమతులపై పడలేదని తెలియజేసింది. డిసెంబర్ నాటికి గతేడాదితో పోలిస్తే ఎగుమతులు డాలర్లలో 9.7 శాతం వృద్ధితో 12 బిలియన్ డాలర్లు దాటాయి. అదే రూపాయల్లో 17 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇంపోర్ట్ అలర్ట్స్ లేకపోతే ఈ ఏడాది ఎగుమతుల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను అప్పాజీ వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement