
న్యూఢిల్లీ: స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో... ముంబైలోని అంధేరీలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మోటెక్ సాఫ్ట్‌వేర్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ అంధేరీ ప్రాంతం నుంచి గత 20 ఏళ్లుగా నడుస్తూ... మిలియన్ల డాలర్లను స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో తనకున్న విదేశీ సంస్థల ద్వారా డిపాజిట్ చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీకి వ్యతిరేకంగా దర్యాప్తు విషయంలో పన్ను అధికారులు స్విట్జర్లాండ్ ప్రభుత్వ సాయాన్ని కోరారు. దీంతో మోటెక్ సాఫ్ట్‌వేర్‌కు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేరషన్ (ఎఫ్‌టీఏ) నోటీసు జారీ చేసింది. పది రోజుల్లోగా నియమిత వ్యక్తి (నామినేటెడ్) వివరాలను సమర్పించాలని కోరింది. సమాచారం పంచుకోవడాన్ని వ్యతిరేకించే హక్కును వినియోగించుకునేందుకే చట్టబద్ధంగా ఈ నోటీసు జారీ చేసింది. జెనీవా బ్రాంచ్‌లో 500 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లతో అతిపెద్ద భారత ఖాతాదారుగా మోటెక్ సాఫ్ట్‌వేర్ పేరు ఇటీవలే వెలుగు చూసిన హెచ్‌ఎస్‌బీసీ జాబితాలో ఉండడం గమనార్హం.