పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ 1:1 బోనస్
♦ 92 శాతం పెరిగిన నికర లాభం
♦ ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 92% పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.245 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.471 కోట్లకు పెరిగిందని పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ పేర్కొంది. తమ కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని కంపెనీ డైరెక్టర్(ఫైనాన్స్) ఆర్.కె.గార్గ్ చెప్పారు. టర్మినల్ చార్జీలు పెరగడం, అధిక పరిమాణంలో గ్యాస్‌ను ప్రాసెస్ చేయడం వల్ల ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించారు.
గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభం 87% లాభంతో రూ.1,706 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది కూడా రికార్డ్ లాభమని వివరించారు. ఒక షేర్‌కు మరో షేర్‌ను(1:1) బోనస్‌గా ఇవ్వనున్నట్లు తెలిపారు. గతేడాదికిగాను షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను(50 శాతం) ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఆధీకృత వాటా మూలధనాన్ని రూ.1,200 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు పెంచుకోవడానికి బోర్డ్ ఆమోదం లభించింది.