
ముంబై: తీవ్ర సమస్యల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ వాటా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. ఈ విషయంలో రెండు కంపెనీల బోర్డులే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘‘ఐడీబీఐ బ్యాంకు, ఎల్‌ఐసీ రెండూ స్వతంత్ర సంస్థలు. అన్ని నిర్ణయాలను బ్యాంకుల బోర్డులకే విడిచిపెట్టాం.
సూక్ష్మ స్థాయిలోనూ వాటిని నిర్వహించాలనుకోవడం లేదు’’ అని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ముంబైలో జరిగిన ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు వార్షిక సదస్సు సందర్భంగా మీడియాకు తెలిపారు. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి ఇప్పటికే 10% పైగా వాటా ఉంది. అయితే, ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తనకున్న వాటాను విక్రయించే ఉద్దేశంతో ఉండగా, కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోతే ఎల్‌ఐసీనే మరో 40 శాతం వాటాను కొనుగోలు చేయాలని కోరే అవకాశం ఉందని మీడియా కథనాల సారాంశంగా ఉంది.