ఇన్ఫోసిస్‌తో బోధ్‌ట్రీ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీ బోధ్‌ట్రీ తాజాగా ఇన్ఫోసిస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ క్లయింట్లకు జీఎస్‌టీ పరిష్కారాలను బోధ్‌ట్రీ అందించనుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.200 కోట్లు. వచ్చే మూడేళ్లలో ఈ మొత్తం సమకూరుతుందని కంపెనీ భావిస్తోంది.
దేశవ్యాప్తంగా 400 దరఖాస్తులు రాగా, 34 సంస్థలు జీఎస్‌టీ సువిధ ప్రొవైడర్లుగా (జీఎస్‌పీ) ఎంపికయ్యాయి. ఇందులో బోధ్‌ట్రీ ఒకటి. జీఎస్‌టీ అమలుకు కావాల్సిన ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతను జీఎస్‌పీలు చేపడతాయి. జీఎస్‌టీ అమలుతో తమ కంపెనీకి వ్యాపారావకాశాలు మరింత మెరుగవుతాయని బోధ్‌ట్రీ ఎండీ ఎల్.ఎన్.రామకృష్ణ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40% ఆదాయ వృద్ధి అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2016–17లో కంపెనీ రూ.79 కోట్ల టర్నోవర్ సాధించింది. స్టార్‌ఫిట్ టెక్నాలజీస్‌తోనూ బోధ్‌ట్రీ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం కింద మార్కెటింగ్ హక్కులు, సాంకేతిక భాగస్వామ్యంతోపాటు ఈక్విటీగా మార్చుకునే వీలున్న పెట్టుబడికి అవకాశం ఉంది.