స్పైస్‌జెట్‌కు 50 ‘క్యూ400’ విమానాలు
♦ బంబార్డియర్‌తో ఒప్పందం
♦ డీల్ విలువ రూ.10,900 కోట్లపైనే
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్’ విమానాల కొనుగోళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. కార్యకలాపాల విస్తరణే ప్రధాన లక్ష్యంగా ఇది తాజాగా బంబార్డియర్ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి 50 వరకు ‘క్యూ400’ టర్బోప్రాప్ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి 86 సీటర్ విమానాలు. ఈ డీల్ విలువ 1.7 బిలియన్ (దాదాపు రూ.10,900 కోట్లు) డాలర్లు. ఈ మేరకు కంపెనీ బంబార్డియర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘క్యూ400’ విమానాలకు సంబంధించి ఇదే అతిపెద్ద సింగిల్ ఆర్డరని స్పైస్‌జెట్ పేర్కొంది. ఇందుకోసం ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై స్పైస్‌జెట్ సంతకాలు చేసింది.
‘క్యూ400 విమానాల కొనుగోలు డీల్ ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ డీల్ ద్వారా చిన్న పట్టణాలకు కనెక్టివిటీ సదుపాయాలను విస్తరిస్తాం’ అని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. పారిస్ ఎయిర్ షో కార్యక్రమంలో ఈ డీల్ కుదిరిందని పేర్కొన్నారు. కాగా 40 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ప్లేన్స్ కొనుగోలు ఒప్పందం జరిగిన మరుసటి రోజే స్పైస్‌జెట్ ఈ డీల్‌ను ప్రకటించడం గమనార్హం.