హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా సమయంలో బ్రాండ్లకు కష్టకాలం వచ్చింది. విశ్వసనీయమైన వినియోగదార్లు కూడా బ్రాండ్లను మరచిపోతున్నారు. ఈ సమయంలో బ్రాండ్లు మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలి. వినియోగదార్లతో సన్నిహిత సంబంధాన్ని ఎర్పరచుకోవాలి. బ్రాండ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ‘జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్ అండ్ బ్రాండింగ్’ లాక్‌డౌన్ సడలింపుల వేళ ఒక సర్వేను నిర్వహించింది. కస్టమర్లను చేరుకోవడంపైనే ఇప్పుడు కంపెనీలు దృష్టిసారించాయని సర్వేలో తేలింది. బ్రాండ్లు కొత్త పరిస్టితులను అందిపుచ్చుకోవాల్సిన సమయం వచ్చిందని జాన్‌రైజ్ డైరెక్టర్ సుమన్ గద్దె వెల్లడించారు.
ప్రపంచం అంతా సాధారణ స్టితికి రావాలని ఎంతలా ప్రయత్నిస్తుందో.. అంత కంటే ఎక్కువగా కంపెనీలు తమ వినియోగదార్లతో అనుబంధాన్ని పెంచుకోవడానికి కృషి చేయాల్సి ఉందన్నారు. బ్రాండ్లకు ప్రచారం కల్పించడం కోసం వ్యాపార ప్రకటనలపై డబ్బులు పెట్టడానికి అసలు వెనకాడకూడదని కంపెనీలు అంటున్నాయని చెప్పారు. ‘‘మా క్లయింట్ల జాబితాలో మరిన్ని బ్రాండ్లు చేరుతూనే ఉన్నాయి. కోవిడ్ కంటే ముందుతో పోలిస్తే ఆదాయాలు తగ్గినప్పటికీ.. వ్యాపార ప్రకటనలపై, బ్రాండ్ కమ్యూనికేషన్‌పై మరిన్ని వ్యయాలు చేయడానికి కంపెనీలు సిద్దంగా ఉన్నాయి’ అని జాన్‌రైజ్ డైరెక్టర్ చైతన్య బోయపాటి తెలిపారు.
కొత్త విధానాలను అందిపుచ్చుకోవాలి..
సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది 27–35 వయసున్న వారున్నారు. 42.4 శాతం మంది ముందుగా తమ పిల్లల దుస్తులు, బొమ్మలు, ఇతరత్రా వస్తువులను కొనాలని భావిస్తున్నారు. లాక్‌డౌన్ అనంతరం 53.8 శాతం మంది స్నేహితులను కలవాలనుకుంటున్నారు. 9 శాతం మంది సౌందర్యం, వెల్‌నెస్ ఉత్పత్తుల షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ సురక్షితమైనదని 60 శాతం మంది గట్టిగా విశ్వసిస్తున్నారు. 49 శాతం మంది సమీప భవిష్యత్‌లో మాల్స్‌కు వెళ్లే ప్రసక్తి లేదని అంటున్నారు.
దుస్తులు, ఆభరణాల షాపింగ్‌పై 18 శాతం మందే ఆసక్తి కనబరిచారు. 58 శాతం మంది సినిమా థియేటర్లు, వినోదానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక స్విగ్గీ, జొమోటో లేదా సొంత డెలివరీ వ్యవస్థలున్న రెస్టారెంట్లు డెలివరీ అత్యంత సురక్షితం అన్న శక్తివంతమైన సందేశాన్ని పంపితేనే నిలదొక్కుకోగలుగుతాయి. ఇవి ఆహారంతో పాటు భద్రత చర్యల గురించి ప్రకటనల ద్వారా తెలియజెబుతూ వినియోగదార్ల మెదడులోకి ఎక్కాలి. రిటైలర్లు పాత ధోరణి నుంచి బయటకు వచ్చి కొత్త విధానాలను అందిపుచ్చుకోవాలి అని సర్వేలో తేలింది.æ
Comments
Please login to add a commentAdd a comment